ఇస్లాం గురించి తరుచుగా ప్రజలు అడిగే 40 ప్రశ్నలు మరియు వాటి సరైన సమాధానాలు ఇక్కడ ప్రస్తావించబడినాయి.
التفاصيل
ఇస్లాం గురించి 40 ముఖ్య ప్రశ్నలు పరిచయం 1- ఇస్లాం అంటే ఏమిటి ? 2- అల్లాహ్ అంటే ఎవరు ? 3- అల్లాహ్ మనలాగే ఉంటాడా? 4- కఅబహ్ గృహం అంటే ఏమిటి ? 5- ముస్లిం అంటే ఎవరు ? 6- ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటే ఎవరు ? 7- ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా అల్లాహ్ యొక్క ప్రవక్తగా మరియు సందేశహరుడిగా మారినారు ? 8- ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లుహు అలైహి వసల్లంను ఆరాధిస్తారా? 9- ఖుర్ఆన్ అంటే ఏమి ? 10- ఖుర్ఆన్ లో ఏమున్నది ? 11- మరేమైనా దివ్య మూలాధారాలు ఉన్నాయా ? 12- కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే ఋజుమార్గమని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? 13- ఇతర మతాలను ఇస్లాం ధర్మం సహిస్తుందా అంటే ఇస్లాంలో పరమత సహనం ఉన్నదా? 14- ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలు – రెండింటి మూలస్థానాలు ఒక్కటేనా లేక వేర్వేరా ? 15- ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ముస్లింల అభిప్రాయం ఏమిటి? 16- “మీరు చూడలేని, వినలేని, స్పర్శించలేని, వాసన చూడలేని, రుచి చూడలేని, ఎలా ఉంటాడో కనీసం ఊహించను కూడా ఊహించలేని దేవుడిని మీరు ఎలా విశ్వసిస్తారు?” 17- ఇస్లామీయ ధర్మం యొక్క మూలస్థంభాలు (మూలసిద్ధాంతాలు) ఏవి ? 18- ఇస్లాం ధర్మంలో ఆరాధనల అసలు ఉద్దేశ్యం ఏమిటి? 19- ముస్లింలకు పరలోకంపై విశ్వాసం ఉందా? 20- ముస్లిమేతరుల మంచిపనులు వ్యర్థమై పోతాయా? 21- ముస్లింలు ఎలాంటి దుస్తులు ధరించాలి? 22- ఇస్లాం ధర్మంలోని ఆహారపదార్థాల నిషేధాలు ఏమి? 23- జిహాద్ అంటే ఏమిటి ? 24- ఇస్లామీయ క్యాలెండర్ అంటే ఏమిటి ? 25- ముఖ్యమైన ఇస్లామీయ పండుగలు ఏవి? 26- ఇస్లామీయ షరిఅహ్ అంటే ఏమిటి ? 27- ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించిందా? 28- ఇస్లాం ధర్మం హింస మరియు ఉగ్రవాదాన్ని, ఆతంకవాదాన్ని ప్రోత్సహిస్తున్నదా? 29- “ఇస్లామీయ ఫండమెంటలిజమ్” అంటే ఏమిటి? 30- ఇస్లాం లోని వివాహ వ్యవస్థ, క్రైస్తవ మతంలోని వివాహ వ్యవస్థకు మధ్య భేదమున్నదా? 31- ఇస్లాం ధర్మం బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తుందా? 32- ఇస్లాం ధర్మం ముస్లిం మహిళలను అణిచి పెడుతున్నదా? 33- ఇస్లాం ధర్మం అన్యమతాల అల్పసంఖ్యాకులను ద్వేషిస్తుందా ? 34- క్రింది అంశాలపై ఇస్లామీయ దృక్పథం ఏమిటి? 35- యూదులు మరియు క్రైస్తవులతో ముస్లింలు ఎలా వ్యవహరిస్తారు ? 36- మానవ హక్కుల గురించి ఇస్లాం ధర్మం ఏ విధంగా గ్యారంటీ ఇస్తున్నది ? 37- ముస్లిం కొరకు కుటుంబ వ్యవస్థ ఎందుకు అంతగా ముఖ్యమైనది ? 38- వయసు మళ్ళిన పెద్దలతో ముస్లింలు ఎలా వ్యవహరిస్తారు? 39- ఆహారపదార్థాల గురించి ఏమిటి? 40- ఎవరైనా ముస్లింగా మారవచ్చా? References ఇస్లాం గురించి 40 ముఖ్య ప్రశ్నలు పరిచయంఅల్హందులిల్లాహ్ – సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే. మేము ఆయన్ను ప్రశంసిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము, మనలోని ప్రతి చెడు మరియు దుష్ట పనుల నుండి ఆయన శరణు వేడుకుంటాము. అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ సన్మార్గం నుండి తప్పించలేరు మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలి వేసిన వారికి మరెవ్వరూ దారి చూపలేరు. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యుడు లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అనీ. తరుచుగా ముస్లిమేతరులు ఇస్లాం మరియు ముస్లింల గురించి అడిగే ప్రశ్నలు ఇక్కడ చర్చించబడినాయి. దీనిని చదివే ప్రతి పాఠకుడు అల్లాహ్ తలిస్తే క్రింది అనేక విషయాలు మరియు అంశాల గురించి స్పష్టమైన మరియు సంతృప్తికరమైన అవగాహన పొందుతాడు:1. ఏకైక సృష్టికర్త అల్లాహ్ 2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ప్రవక్త జీసస్ అలైహిస్సలాం3. ముస్లింలు4. ఇస్లాం ధర్మ మూలస్థంభాలు5. బహుభార్యాత్వం6. జిహాద్ 7. ఇంకా అనేక ఇతర విషయాలు …అల్లాహ్ అనుగ్రహాన్ని పొందిన వారి సన్మార్గాన్ని మనకు కూడా చూపమని అల్లాహ్ ను వేడుకుంటున్నాము. 1- ఇస్లాం అంటే ఏమిటి ? “ఇస్లాం” అనే అరబీ పదానికి అర్థం శాంతి మరియు సమర్పణ. శాంతి అంటే స్వయంగా ప్రశాంతత కలిగి ఉండటం మరయు మీ చుట్టుప్రక్కల కూడా. అలాగే సమర్పణ అంటే ఏకైక ఆరాధ్యుడు, సకల లోకాల సృష్టికర్త మరియు ప్రభువు అయిన అల్లాహ్ యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా సమర్పించుకోవడం.ఇస్లాం ధర్మం నైతిక విలువలను మరియు జీవన శైలిని సూచించే పేరు కలిగున్న ఒక సంపూర్ణ ఏకైక ధర్మం. యూదమతం దాని పేరును జూడా తెగ నుండి తీసుకున్నది, క్రైస్తవమతం దాని పేరును క్రీస్తు నుండి తీసుకున్నది, బౌద్దమతం దాని పేరును గౌతమబుద్ధుడి నుండి తీసుకున్నది, హిందూమతం దాని పేరును సింధూ నది నుండి తీసుకున్నది. అయితే ముస్లింలు తమ గుర్తింపును ఇస్లాం పేరు నుండి తీసుకున్నారే గానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు నుండి కాదు. కాబట్టి, వారిని “ముహమ్మదీయులు” అని పిలవడం సరైన పద్ధతి కాదు. 2- అల్లాహ్ అంటే ఎవరు ?అల్లాహ్ అనేది అరబీ భాషలో “ఏకైక ఆరాధ్యుడు, సకల లోకాల సృష్టికర్త మరియు ప్రభువు“ యొక్క స్వంత పేరు. అల్లాహ్ కేవలం ముస్లింల కొరకు మాత్రమే ఆరాధ్యుడు కాదు, ఆయన సృష్టిలోని ప్రతిదానికీ ఆరాధ్యుడు ఎందుకంటే వాటన్నింటినీ సృష్టించింది మరియు పోషిస్తున్నదీ ఆయనే. అరబీ భాషలో అల్లాహ్ 3- అల్లాహ్ మనలాగే ఉంటాడా?అస్సలు కాదు. నిజానికి, అల్లాహ్ ఏకైకుడు మరియు సంపూర్ణుడు. తన సృష్టిలోని దేనినీ ఆయన పోలి లేడు. అల్లాహ్ తన గురించి స్వయంగా తెలిపిన విషయాలు తప్ప ఒక ముస్లిం ఆయన గురించి మరేదీ పలుకడు. 4- కఅబహ్ గృహం అంటే ఏమిటి ?కఅబహ్ గృహమనేది ముస్లింలందరూ తాము ప్రతిరోజు చేసే ఐదుపూట్ల నమాజు కోసం అభిముఖంగా నిలబడే ఆరాధనా స్థలం. అల్లాహ్ దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం దీనిని నిర్మించమని ప్రవక్త ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాంలను ఆదేశించాడు. ఇదొక రాతి కట్టడం. ప్రవక్త ఆదం అలైహిస్సలాం నిర్మించిన అల్లాహ్ యొక్క మొట్టమొదటి ఆరాధనాలయం యొక్క అసలు పునాదులపైనే ఇది నిర్మించబడిందని చాలా మంది విశ్వాసం. దీనిని సందర్శించేందుకు మొత్తం మానవజాతిని ఆహ్వానించమని అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ఆదేశించినాడు. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం పిలుపుకు స్పందిస్తూ యాత్రికులు అక్కడికి చేరుకున్న తర్వాత ‘లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అంటే హాజరయ్యాం, ఓ ప్రభూ హాజరయ్యాం’ అని పలుకుతారు.కఅబహ్ (అరబీలో: الكعبة అల్ కఅబహ్ : [అర్థం], “ఘనాకారం”), ఇదొక ఘనాకార కట్టణం, ఇది సౌదీఅరేబియా లోని మక్కా నగరంలో ఉన్న ముస్లింల అత్యంత పవిత్రమైన అల్ మస్జిద్ అల్ హరమ్ మధ్యలో ఉన్నది. 5- ముస్లిం అంటే ఎవరు ?“ముస్లిం” అనే పదానికి అర్థం “నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త”ని ప్రకటిస్తూ, అల్లాహ్ యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా తనను తాను సమర్పించుకున్నవాడు. మరోమాటలో చెప్పాలంటే ఎవరైతే తన ఇష్టాన్ని అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకున్నారో, అతడిని ముస్లిం అంటారు. కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మందు వచ్చిన ప్రవక్తలందరూ ముస్లింలే. ఖుర్ఆన్ దివ్యగ్రంథంలో ప్రత్యేకంగా మూసా మరియు ఈసా అలైహిస్సలాంల కంటే చాలా కాలం ముందు జీవించిన ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గురించి “ఆయన (ఇబ్రాహీం) యూదుడు కాదు క్రైస్తవుడు కాదు, కానీ ఆయన ఒక ముస్లిం,” ఎందుకంటే, ఆయన అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకున్నారు. కాబట్టి వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను సంతృప్తిపరచాలని, ఆయన మెప్పు పొందాలని ఎల్లప్పుడూ ప్రయత్నించే ముస్లింలు కొందరు ఉన్నారు. మరికొందరు, అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకోకుండా, ఎల్లప్పుడూ ఇస్లాం పేరు మీద చెడు పనులు చేస్తూ, ఏనాడూ తమ సత్యధర్మం గురించి పట్టించుకోని ముస్లింలనబడే వారూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన ఆధారంగా ఇస్లాం ధర్మం గురించి తీర్మానించుకోకూడదు. ఎందుకంటే ఇస్లాం ధర్మం పరిపూర్ణమైనదే కానీ మానవమాత్రులు కావడం వలన ముస్లింలు పరిపూర్ణులు కారు. ఒకవేళ ఎవరైనా అసలు ఇస్లాం ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటే, వారు ఇస్లాం ధర్మం గురించి అధ్యయనం చేయాలే గానీ ముస్లింల గురించి కాదు. 6- ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటే ఎవరు ?క్లుప్తంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోని ఉత్తమ తెగలలో ఒకటైన ఖురైష్ తెగలో క్రీ.శ. 570వ సంవత్సరంలో జన్మించారు. ఆయన ప్రవక్త ఇబ్రాహీమ్ జ్యేష్ఠ కుమారుడైన ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాం వంశానికి చెందుతారు. ఆయన జన్మించక ముందే ఆయన తండ్రి చనిపోయారు మరియు ఆరెళ్ళ వయస్సులో తల్లి కూడా చనిపోయింది. ఆయన ఏ పాఠశాలలోనూ చదువుకోలేదు. ఎందుకంటే ఆనాటి ఆచారం ప్రకారం బాల్యంలో ఆయన ఒక పల్లెటూళ్ళో ముందుగా హలీమా అనే ఆమె వద్ద పెరిగారు, తర్వాత కొన్నేళ్ళు తాత వద్ద మరియు పినతండ్రి వద్ద పెరిగారు. యవ్వనంలో ఆయన ఎంతో ఉత్తముడు, నిష్కళంకుడు, సత్యవంతుడు, దయాళువు, గౌరవనీయుడు మరియు నిజాయితీపరుడిగా ప్రఖ్యాతి గాంచినారు. తరుచుగా హీరా గుహలో రోజులు తరబడి ఏకాంతంగా గడిపేవారు. 7- ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా అల్లాహ్ యొక్క ప్రవక్తగా మరియు సందేశహరుడిగా మారినారు ?40 యేళ్ళ వయస్సులో, మొట్టమొదటిసారి హీరా గుహలో ఏకాంతంగా ఉన్నప్పుడు, దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ఆయనకు కనబడి, అల్లాహ్ నుండి తొలి దివ్యవాణిని అందజేసి, అల్లాహ్ ఆయనను అంతిమ ప్రవక్తగా ఎంచుకున్నట్లు తెలిపినారు. ఆనాటి నుండి 23 సంవత్సరాల వరకు దివ్యవాణి ఆయనపై అవతరించింది. వాటిని ఆయన సహచరులు ఖుర్ఆన్ గ్రంథంగా సంకలనం చేసినారు. ఇది మొత్తం మానవాళి కొరకు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ పంపిన అంతిమ దివ్యసందేశం. దివ్యఖుర్ఆన్ దాని అసలు అవతరించిన రూపంలో సురక్షితంగా భద్రపరచబడింది. ఎన్నడూ ఎలాంటి మార్పులు చేర్పులకు గురికాలేదు. తోరా(Torah), కీర్తనలు (psalms), జీసస్ సువార్తలలోని సత్యవచాలను పునఃధృవీకరించింది[1].దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం నుండి విన్న వచనాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పఠించడం మొదలు పెట్టారు మరియు తనపై అల్లాహ్ అవతరింపజేసిన సత్యసందేశాన్ని ప్రజలకు బోధించసాగారు. ఆయను మరియు ఆయనతో పాటు ఉన్న చిన్న సహచరుల సమూహం తీవ్రమైన దౌర్జన్నాన్ని, అణచివేతను ఎదుర్కొనవలసి వచ్చింది. అది ఎంత తీవ్రరూపం దాల్చిందంటే, కొన్నేళ్ళ తర్వాత మరో ప్రదేశానికి వలస వెళ్ళేందుకు అల్లాహ్ ఆయనకు అనుమతి నిచ్చాడు. మక్కా నుండి మదీనా పట్టణానికి ఆయన చేసిన ఈ వలసనే హిజ్రత్ అంటారు. దీని ఆధారంగానే ఇస్లామీయ క్యాలెండరు తయారు చేయబడింది. అనేక సంవత్సరాల తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు సాటిలేని విజేతలుగా మక్కా నగరంలో ప్రవేశించి, తమపై ఎన్నో దౌర్జన్యాలు, అరాచకాలు చేసిన తమ శత్రువులను క్షమించారు, ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు. 63 యేళ్ళ వయస్సులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయేనాటికి, అరేబియా ద్వీపకల్పంలోని అధిక భాగం ఇస్లాం ధర్మాన్ని అనుసరించసాగింది. ఆయన మరణానంతరం, ఇస్లాం ధర్మం తూర్పులో చైనా వరకు మరియు పశ్చిమంలో స్పెయిన్ వరకు వ్యాపించింది. 8- ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లుహు అలైహి వసల్లంను ఆరాధిస్తారా?ఖచ్ఛితంగా లేదు. ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గానీ, మరే ప్రవక్తను గానీ అస్సలు ఆరాధించరు. ఆదం, నూహ్, ఇబ్రాహీమ్, దావూద్, సులైమాన్, మూసా మరియు జీసస్ అలైహిస్సలాం మొదలైన ప్రవక్తలతో పాటు మొత్తం ప్రవక్తలందరినీ ముస్లింలు నమ్ముతారు. అంతేగాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ యొక్క ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త అని కూడా నమ్ముతారు. కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడనీ, ఏ మానవుడూ ఆరాధనలకు అర్హుడు కాదని వారు దృఢంగా నమ్ముతారు. 9- ఖుర్ఆన్ అంటే ఏమి ? దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అరబీ భాషలో అవతరించిన అసలు వచనాల సంకలనమే ఖుర్ఆన్ గ్రంథం. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించగా, ఆయన దానిని తన సహచరులకు బోధించారు. కొందరు సహచరులు దానిని వ్రాతపూర్వకంగా భద్రపరచగా, మరికొందరు కంఠస్థం చేసి మరీ భద్రపరచుకున్నారు. ఆయన జీవిత కాలంలోనే ఆ సహచరులు ఆయనకు చదివి వినిపించి మరీ ధృవీకరించుకున్నారు. అనేక శతాబ్దాలు దాటినా దానిలోని 114 అధ్యాయాలలో, నేటికీ ఒక్క అక్షరం కూడా మార్చ బడలేదు, ఎన్నడూ మార్పు చెందదు కూడా. కాబట్టి, ప్రతికోణంలోనూ కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 14 శతాబ్దాలకు పూర్వం అవతరించిన ఖుర్ఆన్ గ్రంథం మాత్రమే పరిపూర్ణమైనది, అద్వితీయమైనది మరియు అపూర్వమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన (అల్ అలఖ్ అధ్యాయంలోని) మొట్టమొదటి వచనాలు. 10- ఖుర్ఆన్ లో ఏమున్నది ?సర్వలోకాల సృష్టకర్త అయిన అల్లాహ్ యొక్క చిట్టచివరి దివ్యసందేశమైన ఖుర్ఆన్ ముస్లింల దైవవిశ్వాసం మరియు ఆచరణల యొక్క ప్రధాన మూలాధారం. ఇస్లామీయ మూలసిద్ధాంతం, ఆరాధన, జీవితం, మరణం, వివాహం, విడాకులు, విద్య, సైన్సు, కుటుంబం, సాంఘిక వ్యవహారాలు, మానవహక్కులు, సముచితమైన మానవ నైతిక ప్రవర్తన మరియు సరిసమాన ఆర్థిక వ్యవస్థ మొదలైన అనేక విషయాలు మరియు అంశాలన్నింటినీ ఖుర్ఆన్ గ్రంథం సంబోధిస్తున్నది. అయితే, దానిలోని అసలు ప్రధానాంశం - సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ మరియు ఆయన సృష్టితాల మధ్య నున్న సంబంధం. 11- మరేమైనా దివ్య మూలాధారాలు ఉన్నాయా ?అవును, ఉన్నాయి. అవి సున్నతులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలు మరియు ఉపమానాలు ముస్లింల కొరకు రెండో ప్రధాన ప్రామాణిక మూలాధారం. హదీథు అంటే ప్రామాణికంగా నమోదు చేయబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పలుకులు, ఆచరణలు మరియు సహచరులకు ఇచ్చిన అనుమతులు. సున్నతులను విశ్వసించడమనేది ఇస్లామీయ విశ్వాసంలోని రెండో ప్రధాన భాగం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల కొన్ని ఉపమానాలు :1_’ఇతరులపై దయచూపని వారిపై అల్లాహ్ కూడా దయ చూపడు.’2_’స్వయంగా తనకోసం ఏదైనా కోరుకుంటాడో, దానినే ఇతరుల కోసం కూడా కోరుకోనంత వరకు మీలో ఎవ్వడూ నిజమైన విశ్వాసి కాజాలడు.’3_’ప్రత్యర్థిని పడగొట్టినవాడు బలవంతుడు కాడు, కానీ తారస్థాయికి చేరుకున్న కోపంలో తనను తాను నిగ్రహించుకో గలిగినవాడే బలవంతుడు.’ (బుఖారీ, ముస్లిం, తిర్మిథీ మరియు బైహఖీ హదీథు గ్రంథాల నుండి) 12- కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే ఋజుమార్గమని ఎవరికైనా ఎలా తెలుస్తుంది?1- మనందరి దైవమైన అల్లాహ్ ఏకైకుడు, అద్వితీయుడు, అపూర్వుడు, పరిపూర్ణుడు, సర్వలోకాల ప్రభువు మరియు సృష్టికర్త అని బోధిస్తున్న ఏకైక ధర్మం ఇస్లాం ధర్మం మాత్రమే.2- కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి గానీ జీసస్ ను లేదా విగ్రహాలను లేదా దైవదూతలను ఆరాధించకూడదని పూర్తిగా విశ్వసిస్తున్న ధర్మం కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే. 3- 1400 సంవత్సరాలకు పూర్వం అవతరించిన ఖుర్ఆన్ గ్రంథంలో ఎలాంటి వైరుధ్యాలు, వ్యత్యాసాలు లేవు. దానిలో అనేక వైజ్ఞానిక వాస్తవాలు ప్రస్తావించబడినాయి. కేవలం ఈ మధ్య మాత్రమే వాటిలో కొన్నింటిని శాస్త్రజ్ఞులు ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో కనిపెట్టారు, మరికొన్నింటిని కనిపెట్టే పరికరాలను తయారు చేసే స్థాయికి ఇంకా వారు చేరుకోలేదు. కాబట్టి, ఖుర్ఆన్ గ్రంథం ఎన్నడూ సైన్సుకు విరుద్ధంగా లేదు.4- ఖుర్ఆన్ లోని ఒక్క అధ్యాయం వంటి అధ్యాయాన్నైనా తయారు చేయమని అల్లాహ్ సవాలు చేసినాడు. అంతేగాక, ఎవ్వరూ ఎన్నడూ ఆయన సవాలును ఎదుర్కోలేరని కూడా స్పష్టంగా తెలిపినాడు. గత 14 శతాబ్దాల నుండి ఈనాటి వరకు అది తిరుగులేని సవాలుగా అలాగే నిలిచి ఉన్నది. 5- నిశ్చయంగా మొత్తం చరిత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి. ఒక ముస్లిమేతరుడు రచించిన “The 100 most influential men in History” (అంటే చరిత్రలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది పురుషులు) అనే పుస్తకంలో ఆయన మొట్టమొదటి స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరియు ప్రవక్త జీసస్ అలైహిస్సలాంకు 3వ స్థానం ఇచ్చినాడు. ప్రవక్త జీసస్ అలైహిస్సలాం కూడా అల్లాహ్ పంపిన ప్రవక్తయే అనే విషయాన్ని మనం ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవాలి. 13- ఇతర మతాలను ఇస్లాం ధర్మం సహిస్తుందా అంటే ఇస్లాంలో పరమత సహనం ఉన్నదా?నిస్సందేహంగా సహిస్తుంది. ఇస్లాంలో పరమత సహనం ఉన్నది. ఖురఆన్ లోని అల్లాహ్ ఆదేశం:ధర్మంలో ఎలాంటి బలవంతం లేదు. (2:214)ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా మిమ్ముల్ని మీ ఇల్లూ వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్ వ్యవహారం చేయడాన్ని, వారికి న్యాయం చేయడాన్ని అల్లాహ్ ఎంత మాత్రం నిరోధించడు. పై అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. (ఖుర్ఆన్, 60:8)ఇస్లామీయ రాజ్యంలోని అల్పసంఖ్యాకుల సంరక్షణ ఇస్లామీయ చట్టం యొక్క బాధ్యతలలోని ఒక ముఖ్య బాధ్యత. అందువలననే ఇస్లామీయ దేశాలన్నింటిలోనూ ముస్లిమేతరుల దేవాలయాలు, ఆరాధనాలయాలు వర్ధిల్లాయి. చరిత్రలో ఇస్లామీయ పరమత సహనాన్ని చూపే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, 1. 634వ సంవత్సరంలో, ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు జెరుసలేం పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు, అక్కడి ప్రజలందరికీ ఆయన శరణు ప్రసాదించారు మరియు ఇస్లాం ధర్మాన్ని అనుసరించకుండా, తమ తమ ధర్మాల ప్రకారమే స్వేచ్ఛగా జీవించే అనుమతినిచ్చారు. 2. స్పెయిన్ దేశాన్ని పరిపాలించిన ముస్లింల కాలం ఇస్లామీయ పరమత సహనానికి మరో మంచి ఉదాహరణ. ఆనాటి స్పెయిన్ లోని ఇస్లామీయ పరిపాలనలో యూదులు స్వర్ణయుగ వైభవాలను అనుభవించారు. 3. అంతేకాదు, ఇస్లాం ధర్మం ముస్లిమేతర అల్పసంఖ్యాకులకు తమ స్వంత కోర్టులను పెట్టుకునే అనుమతినిచ్చి, వారికి తగిన అటానమీ (autonomy) ప్రసాదించింది. 14- ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలు – రెండింటి మూలస్థానాలు ఒక్కటేనా లేక వేర్వేరా ?యూదమతంతో పాటు, వాటి మూలాలు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు పోయి కలుస్తాయి. ఈ మూడు ధర్మాల ప్రవక్తలు తిన్నగా ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇద్దరు కుమారుల సంతతి నుండే ఎంచుకోబడినారు. 1. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క పెద్దకుమారుడైన ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతతి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంచుకోబడినారు. 2. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క రెండవ కుమారుడైన ప్రవక్త ఇస్హా అలైహిస్సలాం సంతతి నుండి ప్రవక్త మూసా అలైహిస్సలాం, ప్రవక్త జీసస్ అలైహిస్సలాం మొదలైనవారు ఎంచుకోబడినారు. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఒక పట్టణాన్ని స్థాపించారు. ఈనాడు అది మక్కా పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇంకా అక్కడ కాబాగృహాన్ని నిర్మించారు. ఈనాడు ప్రతిరోజూ ఐదు పూటలా నమాజు చేసేటప్పుడు ముస్లింలు కాబాగృహం దిక్కు వైపుకే తిరిగి నిలబడతారు. 15- ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ముస్లింల అభిప్రాయం ఏమిటి? ప్రవక్త జీసస్ అలైహిస్సలాంను మరియు ఆయన తల్లి కన్య మేరీలను ముస్లింలు ఎంతో గౌరవిస్తారు. తండ్రి లేకుండా పుట్టిన ప్రవక్త జీసస్ అలైహిస్సలాం యొక్క పుట్టుక ఒక మహిమ అని ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది. “అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. అతన్ని మట్టితో చేసి: అయిపో అని ఆజ్ఞాపించగా అతను (మనిషిగా) అయిపోయాడు” (ఖుర్ఆన్ 3.59).“ఒక ప్రవక్తగా అల్లాహ్ అనుజ్ఞతో ఆయన తన తల్లి శీలాన్ని ధృవీకరిస్తూ, పుట్టిన వెంటనే ఆయన ప్రజలకు జవాబివ్వడం, అంధులకు దృష్టి ప్రసాదించడం, కుష్టు రోగులను నయం చేయడం, మృతులను తిరిగి సజీవులుగా చేయడం, మట్టి నుండి పక్షిని తయారు చేయడం వంటి అనేక మహిమలు ప్రదర్శించారు. అన్నింటి కంటే ముఖ్యంగా అల్లాహ్ యొక్క సందేశాన్ని అందజేయడం. ఖుర్ఆన్ ప్రకారం, ఆయన అస్సలు శిలువ వేయబడలేదు, స్వర్గంలోనికి ఎత్తుకోబడినారు”. (ఖుర్ఆన్, మర్యమ్ అధ్యాయం) 16- “మీరు చూడలేని, వినలేని, స్పర్శించలేని, వాసన చూడలేని, రుచి చూడలేని, ఎలా ఉంటాడో కనీసం ఊహించను కూడా ఊహించలేని దేవుడిని మీరు ఎలా విశ్వసిస్తారు?”వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితంలో ఎవ్వరూ అల్లాహ్ ను చూడలేదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనల ద్వారా మనం తెలుసుకున్నాము. ఏ విధంగానైనా ఆయన దరి చేరేలా మన పంచేద్రియాలను ఉపయోగించే శక్తిసామర్ధ్యాలు మనకు లేవు. ఏదేమైనా, ఈ విశ్వం మొత్తం తనకు తానుగా ఉనికిలోనికి వచ్చే అవకాశం లేదనే అసలు సత్యాన్ని గుర్తించేందుకు మన పంచేంద్రియాలను ఉపయోగించమని ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది. ఈ మహాద్భుత విశ్వాన్ని ఖచ్ఛితంగా డిజైన్ చేసి, ఉనికిలోనికి తెచ్చిన ఒక సర్వశక్తిమంతుడైన సృష్టికర్త తప్పకుండా ఉన్నాడు. ఇది మన శక్తిసామర్ధ్యాలకు అందని విషయం. అయినా, దీనిని మనం గ్రహించగలం, దీని అనుభూతి పొందగలం మరియు చూడగలం. ఉదాహరణకు, అతని లేక ఆమె పెయింటింగ్ ను గుర్తించేందుకు దానిని తయారు చేస్తున్నప్పుడు మనం ఆ ఆర్టిస్టును చూడవలసిన అవసరం లేదు. కాబట్టి, పెయింటింగ్ చేసిన ఆ కళాకారుడిని ఒకవేళ మనం చూడలేక పోయినా, ఆ పెయింటింగును ఎవరో ఒక కళాకారుడే తయారు చేసి ఉంటాడని గుర్తిస్తాము. అంతేగానీ తనకు తానుగా ఆ పెయింటింగ్ ఉనికిలోనికి వచ్చిందని భావించము. అలాగే, అల్లాహ్ ను చూడవలసిన అవసరమేమీ లేకుండానే, ప్రతిదీ ఆయనే సృష్టించాడని మనం విశ్వసించవచ్చు. 17- ఇస్లామీయ ధర్మం యొక్క మూలస్థంభాలు (మూలసిద్ధాంతాలు) ఏవి ?ఇస్లామీయ ధర్మం యొక్క మూలస్థంభాలు ఐదు. అవి:1. షహాదహ్ అంటే సాక్ష్యప్రకటన: ఒక్క అల్లాహ్ తప్ప, ఆరాధింపబడే అర్హత గల వారెవ్వరూ లేరని మరియు ముహమ్మద్, అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమివ్వడం. 2. సలాహ్ – నమాజు: ప్రతిరోజూ ఐదు సార్లు నమాజు చేయడం.3. సౌమ్ – ఉపవాసం : రమదాన్ నెల మొత్తం విధిగా ఉపవాసం పాటించడం. 4. జకాతు – విధిదానం : ధనవంతుల సంపదలోని పేదప్రజల హక్కు. 5. హజ్ యాత్ర : శారీరకంగా మరియు ఆర్ధికంగా తగిన స్తోమత గలవారు జీవితంలో కనీసం ఒక్కసారి మక్కా వెళ్ళి, హజ్ యాత్రలో పాల్గొనడం. ఉదాహరణకు – ఒకవేళ మన వద్ద ఒక బిల్డింగు ప్లాను ఉందని అనుకుందాము. దానికి ఒక మంచి ఆకారాన్నిస్తూ నిర్మించాలంటే, దాని మూలస్థంభాలన్నీ ఎత్తులో మరియు దృఢత్వంలో సమానంగా ఉండాలి. ఇస్లాం ధర్మం విషయంలో కూడా అంతే. ఒక ముస్లింగా తప్పక ఇస్లామీయ మూలస్థంభాలన్నింటినీ సరిసమానంగా ఆచరించ వలసి ఉన్నది.ఉదాహరణకు, రమదాన్ నెల ఉపవాసాలు పాటించకుండా లేక ప్రతిరోజూ ఐదు పూటలా నమాజులు చేయకుండా హజ్ యాత్ర చేస్తే చాలని భావించడం సరికాదు. ఒక బిల్డింగులో కేవలం పిల్లర్స్ అంటే మూలస్థంభాలు మాత్రమే ఉన్నాయని భావించుదాం. అలాంటి స్థితిలో అదొక బిల్డింగ్ యే అనబడదు. దానిపై కప్పు ఉండాలి. దానికి గోడలు, తలుపులు మరియు కిటికీలు మొదలైనవి ఉండాలి. అప్పుడే అది ఒక బిల్డింగు అని పిలబడుతుంది. ఇస్లాం ధర్మం విషయం కూడా అంతే. ఇస్లాం ధర్మంలో కేవలం మూలస్థంభాలు మాత్రమే లేవు. దానిలో ఇస్లామీయ నైతికత అనబడే నిజాయితీ, సత్యత, దయాగుణం, దానధర్మాలు, ఇతరులను గౌరవించడం, ఇంకా ఇలాంటి అనేక ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి, ఒక ముస్లింగా జీవించాలంటే, కేవలం ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభాలను మాత్రమే ఆచరిస్తే సరిపోదు, వాటితో పాటు ఒక మంచి మానవుడి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండేందుకు వీలయినంత ఎక్కువగా, శాయశక్తులా ప్రయత్నించాలి. అప్పుడే ఆ బిల్డింగు నిర్మాణం పూర్తయి, ఎంతో అందంగా కనబడుతుంది. 18- ఇస్లాం ధర్మంలో ఆరాధనల అసలు ఉద్దేశ్యం ఏమిటి?ఆరాధనల అసలు ఉద్దేశ్యం అల్లాహ్ యొక్క భయభక్తులు అలవర్చుకోవడం. కాబట్టి, అది నమాజు అయినా, ఉపవాసం లేక దానధర్మాలైనా అవి మనలన్ని అల్లాహ్ కు దగ్గరగా తీసుకువెళతాయి. ఎప్పుడైతే ఒకరి ఆలోచనలలో మరియు ఆచరణలలో అల్లాహ్ యొక్క భయభక్తులు పాదుకొంటాయో, ఆ వ్యక్తి ఇహపరలోకాలలో అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఎక్కువగా ప్రసాదింపబడే ఉత్తమ స్థానం పైకి చేరుకుంటాడు. 19- ముస్లింలకు పరలోకంపై విశ్వాసం ఉందా?అల్లాహ్ అత్యంత న్యాయవంతుడు మరియు తన న్యాయాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తాడు. మన పలుకులకు మరియు పనులకు మనమే బాధ్యత వహించే వ్యవస్థను ఆయన స్థాపించాడు. ఎవరైతే మంచి చేస్తారో, వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. అలాగే ఎవరైతే చెడు చేస్తారో, వారు కఠినంగా శిక్షించబడతారు. కాబట్టి, దాని కోసం స్వర్గనరకాలను ఆయన సృష్టించాడు. రెండింటిలోనూ వేర్వేరు ప్రవేశ నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత జీవితం తాత్కాలికమైన జీవితమని ముస్లింలు నమ్ముతారు. ఇదొక పరీక్ష. ఒకవేళ ఈ పరీక్షలో మనం పాసైతే, స్వర్గంలో మంచి వ్యక్తుల సహచర్యంలో శాశ్వతమైన సుఖసంతోషాల జీవితం మనకు ప్రసాదించబడుతుంది. 20- ముస్లిమేతరుల మంచిపనులు వ్యర్థమై పోతాయా?లేదు. ఖుర్ఆన్ స్పష్టంగా చెబుతున్నది, “ఎవరైనా అణువంత మంచి చేసినా వారు దానిని చూస్తారు మరియు ఎవరైనా అణువంత చెడు చేసినా వారు కూడా దానిని చూస్తారు” (ఖుర్ఆన్ 99:7- 8).దీని అర్థం ఏమిటంటే, మంచిపనులు చేసిన ముస్లిమేతరులకు ఈ ప్రపంచంలోనే వారి మంచి పనులకు తగిన ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. అలాగే, మంచిపనులు చేసిన ముస్లింలకు ప్రతిఫలం ఈ ప్రపంచంలో ప్రసాదించబడటమే గాక, పరలోకంలో కూడా ప్రసాదించబడుతుంది. ఏదేమైనా అంతిమ తీర్పు స్వయంగా అల్లాహ్ పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. (ఖుర్ఆన్ 2:62) 21- ముస్లింలు ఎలాంటి దుస్తులు ధరించాలి?సచ్ఛీలత, పాతివ్రత్యముల గురించి ఇస్లాం ధర్మం నొక్కి వక్కాణిస్తున్నది. ఏ వ్యక్తినైనా సెక్స్ వస్తువుగా భావించడం తగదు. స్త్రీపురుషులు ఉభయుల దుస్తుల విషయంలో కొన్ని నిర్ణీత మార్గదర్శక నియమాలు ఉన్నాయి. అవి మరీ పలుచగా లేదా మరీ బిగుతుగా ఉండి వారి శరీర ఆకారాన్ని బయట పెట్టే విధంగా ఉండకూడదు. పురుషుల దుస్తులు కనీసం మోకాళ్ళ క్రింది భాగం అంటే కాలి పిక్కల నుండి నాభి వరకు కప్పి ఉంచాలి. స్త్రీల దుస్తులు వారి మొత్తం శరీరాన్ని కప్పి ఉంచాలి. 22- ఇస్లాం ధర్మంలోని ఆహారపదార్థాల నిషేధాలు ఏమి?పందిమాంసం లేదా పందికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు, అల్లాహ్ పేరు మీద ఖుర్బానీ చేయకముందే చనిపోయిన జంతువుల మరియు క్రూరమృగాల మాసం తినకూడదని, వాటి రక్తం త్రాగకూడదని, మత్తునిచ్చే మద్యపానం, డ్రగ్స్ వంటివి వాడకూడదని ఖుర్ఆన్ ముస్లింలను స్పష్టంగా ఆదేశిస్తున్నది. 23- జిహాద్ అంటే ఏమిటి ?“జిహాద్” అనే అరబీ పదానికి అర్థం శ్రమించడం, ప్రయాస పడటం. ఇస్లామీయ పరిభాషలో దీని అర్థం అల్లాహ్ మార్గంలో శ్రమించడం, ప్రయాస పడటం. అనుదిన జీవితంలో అల్లాహ్ మెప్పు కోసం చిత్తశుద్ధితో మనం చేసే ప్రతి పనీ జిహాద్ గానే పరిగణించబడుతుంది. మహోన్నతమైన జిహాద్ ఏదంటే, దౌర్జన్యపరుడైన రాజు అత్యాచారాలకు వ్యతిరేకంగా నిలబడటం మరియు అతడి ఎదుట సత్యం పలుకడం. చెడు ఆలోచనల నుండి చెడుపనుల నుండి స్వయంగా నియంత్రించుకోవడం కూడా గొప్ప జిహాద్ క్రిందకే వస్తుంది. ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం లేదా శత్రుదాడి నుండి ఇస్లామీయ రాజ్యాన్ని కాపాడటం కోసం చేసే సాయుధ పోరాటం కూడా జిహాద్ క్రిందకే వస్తుంది. అయితే ఇలాంటి జిహాద్ యుద్థాన్ని ఇస్లామీయ ధార్మిక నాయకత్వం లేదా ఖుర్ఆన్ మరియు సున్నతులను అనుసరించి పాలిస్తున్న ఇస్లామీయ దేశం యొక్క రాజు లేదా నాయకుడు ప్రకటించవలసి ఉంటుంది లేదా అనుమతించ వలసి ఉంటుంది. 24- ఇస్లామీయ క్యాలెండర్ అంటే ఏమిటి ?క్రీ.శ. 622లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనా పట్టణానికి వలస వెళ్ళినప్పటి నుండి ముస్లింల హిజ్రీ క్యాలెండరు ప్రారంభమవుతుంది. ఇది చంద్రమాన క్యాలెండరు, దీనిలో 354 దినాలు ఉంటాయి. ఈ ఇస్లామీయ క్యాలెండరు యొక్క మొట్టమొదటి నెల ముహర్రం. ఇంగ్లీషు క్యాలెండరులోని క్రీ. శ. 2015వ సంత్సరం హిజ్రీ క్యాలెండరులోని 1436వ సంవత్సరానికి సమానం. 25- ముఖ్యమైన ఇస్లామీయ పండుగలు ఏవి?ఈదుల్ ఫిత్ర్ పండుగ ప్రతి సంవత్సరం రమదాన్ ఉపవాసాల నెల పూర్తవగానే జరుపుకోబడుతుంది. ప్రత్యేక సామూహిక ఈద్ నమాజు, సేమ్యాలనబడే పాయసం మరియు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, పేదలకు ఫిత్రాదానం ఇవ్వడం మొదలైనవి ఈ పండుగలో భాగం. ఈదుల్ అద్హా (బక్రీద్) పండుగ ప్రతి సంవత్సరం దిల్ హజ్ నెల పదవ తేదీన జరుగుతుంది. ప్రత్యేక సామూహిక ఈద్ నమాజు, తగిన ఆర్ధిక స్తోమత ఉన్నవాళ్ళు ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగలో భాగం. అల్లాహ్ ఆదేశన్ని శిరసావహిస్తూ విధేయతాపూర్వకంగా ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన కుమారుడు ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాంను బలి ఇవ్వడానికి సిద్ధపడిన అపూర్వ సంఘటనకు గుర్తుగా ఒక మేక, గొర్రె, ఆవు లేదా ఒంటెలను ఖుర్బానీ ఇచ్చి, దాని మాంసంలో కొంత భాగం పేదవాళ్ళకు మరియు బంధువులకు పంచి పెట్టడం, మరికొంత భాగంతో స్వయంగా విందుభోజనం తయారు చేసుకుంటారు. వడం మొదలైనవి ఈ పండుగలో భాగం. 26- ఇస్లామీయ షరిఅహ్ అంటే ఏమిటి ?షరిఅహ్ అనేది క్రింది రెండు మూలాధారాల నుండి గ్రహించబడిన ఒక సమగ్రహమైన ఇస్లామీయ చట్టం:a) ఖుర్ఆన్ గ్రంథంb) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులు.షరిఅహ్ మన జీవితంలోని ప్రతి విషయాన్ని సంబోధిస్తున్నది. జీవితం, సంపద, రాజకీయ మరియు ధార్మిక స్వేచ్ఛ, స్త్రీల మరియు అల్పసంఖ్యాకుల హక్కులు కాపాడటం మొదలైన ప్రాథమిక మానవ హక్కులను కాపాడటమే ఇస్లామీయ షరిఅహ్ చట్టాల ముఖ్యోద్దేశం. ఇస్లామీయ షరిఅహ్ చట్టాలను అమలులో పెట్టడం వలననే ఇస్లామీయ దేశాలలో నేరాల సంఖ్య తక్కువగా ఉన్నది[2]. 27- ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించిందా?ఎన్నడూ కాదు. ఖుర్ఆన్ ప్రకారం, , “ఇస్లాం ధర్మంలో బలవంతం లేదు” (2:256), కాబట్టి, ముస్లింగా మారమని ఎవ్వరినీ బలవంతం చేయకూడదు.ప్రజలను మరియు ప్రాంతాలను వారి దౌర్జన్యపరులైన రాజులు మరియు చక్రవర్తుల నుండి విముక్తి చేసి, వారికి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ప్రసాదించేందుకు ఇస్లామీయ సైన్యాలు ఖడ్గాన్ని ఉపయోగించిన మాట నిజమే. ఎందుకంటే ఆనాడు యుద్ధరంగంలో ప్రధానంగా ఖడ్గం వాడబడేది. ఏదేమైనా, ఇస్లాం ధర్మం ఎన్నడూ ఖడ్గం ద్వారా వ్యాపించలేదు. ఎందుకంటే ఇస్లామీయ సైన్యాలు కాలుమోపిన ఆధారాలేమీ లేని ఇండోనేషియా, చైనా మరియు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో నేటికీ ముస్లింలు ఉన్నారు. ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించిందని అనడం ఎలా ఉంటుందంటే క్రైస్తవ ధర్మం ఆటోమేటిక్ మషిన్ గన్లు, F-16లు, అటామిక్ బాంబులు మొదలైన వాటి ద్వారా వ్యాపించింది అనడం వంటింది. అందులో ఏ మాత్రం నిజం లేదు. క్రైస్తవ ధర్మం క్రైస్తవ మిషనరీల ద్వారా వ్యాపించింది. అరబ్ ప్రాంతంలోని పది శాతం ప్రజలు నేటికీ క్రైస్తవులుగా జీవిస్తున్నారు. మరి “ఇస్లామీయ ఖడ్గం” ముస్లిం దేశాలలో నివసిస్తున్న ముస్లిమేతర అల్పసంఖ్యాకులను ఇస్లాం ధర్మంలోనికి ఎందుకు మార్చలేక పోయింది. 700 సంవత్సరాల పాటు ముస్లింలు పరిపాలించిన భారతదేశంలో నేటికీ ముస్లింలు అల్పసంఖ్యలోనే మిగిలి ఉన్నారు. అమెరికాలో, ఇస్లామీయ ధర్మం చాలా వేగంగా వ్యాపిస్తున్నది మరియు ఎలాంటి ఖడ్గం ప్రసక్తే లేకుండా అక్కడ ముస్లింల సంఖ్య దాదాపు 6 మిలియన్లకు చేరుకున్నది. 28- ఇస్లాం ధర్మం హింస మరియు ఉగ్రవాదాన్ని, ఆతంకవాదాన్ని ప్రోత్సహిస్తున్నదా?అస్సలు కాదు. ఇస్లాం ధర్మం శాంతి, దైవసమర్పణ, మానమర్యాదలు, ప్రేమాభిమానాలు, దయ మొదలైన ఉత్తమ నైతిక విలువలు కలిగిన ఒక సత్యధర్మం. మానవ జీవితాల భద్రత నొక్కి వక్కాణిస్తుంది. ఖుర్ఆన్ ప్రకటిస్తున్నది, [5వ అధ్యాయం, 32వ వచనం], “ఎవరైనా ఒక ప్రాణాన్ని కాపాడితే, అతడు మొత్తం మానవజాతిని కాపాడినట్లే మరియు అకారణంగా ఎవరైనా ఒక వ్యక్తిని హత్యచేస్తే, అతడు మొత్తం మానవజాతిని హత్య చేసినట్లే.” క్రూసేడు దాడులు, స్పెయిన్ మరియు రెండవ ప్రపంచ యుద్ధంలోని హింస లేదా బోస్నియాలో క్రైస్తవ సెర్బులు ఒడిగట్టిన ముస్లింల ఊచకూతలు లేదా రెవరండ్ జిమ్ జోన్స్, డేవిడ్ కొరేష్, డాక్టర్ బరుచ్ గోల్డ్ స్మిత్ వంటి దౌర్జన్యపరుల దాడులు మొదలైన అన్ని రకాల హింసలను మరియు దౌర్జన్యాలను ఇస్లాం పూర్తిగా ఖండిస్తున్నది. హింస, దౌర్జన్యాలను ప్రోత్సహించే వారెవరైనా సరే, అలాంటి వారు తమ ధర్మోపదేశాలను అస్సలు అనుసరించడం లేదు. ఎందుకంటే ఏ ధర్మమూ వాటిని ప్రోత్సహించదు.అయితే, ఒక్కోసారి ఫాలస్తీను పౌరుల వలే అణచివేతకు గురవుతున్న ప్రజల వద్ద తిరుగుబాటు తప్ప వేరే మార్గం ఉండక పోవచ్చు. ఇది తప్పు అయినప్పటికీ, ఇతర దేశాల దృష్టిని ఆకర్షించేందుకు ఇదొక్కటే మార్గమని వారు భావిస్తూ ఉండ వచ్చు. అయితే కొందరు ఇస్లాం వలనే ఇలాంటి తిరుగుబాటు జరుగుతుందని భావిస్తున్నారు. మరి ఇస్లాం ఉనికి లేని అనేక ప్రాంతాలలో కూడా ఎంతో తీవ్రమైన టెర్రరిజం మరియు హింస జరుగుతున్నది కదా. మరి దానికేమంటారు ?ఉదాహరణకు, ఐర్లాండ్, దక్షిణ ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు శ్రీలంకా మొదలైన దేశాలలోని ఉగ్రవాదం. కొన్నిసార్లు హింసా దౌర్జన్యాలు, ఉగ్రవాదమనేది ఆక్రమించిన దౌర్జన్యపరుల మరియు దురాక్రమణకు గురైన నిస్సహాయుల మధ్య జరిగే పోరాటం లేదా అణచివేతకు గురవుతున్న మరియు అణచివేస్తున్న వారిరువురి మధ్య జరిగే పోరాటం కావచ్చు. ప్రజలు ఎందుకు టెర్రరిస్టులుగా మారుతున్నారో కనిపెట్టవలసిన అవసరం ఎంతో ఉన్నది. దురదృష్టవశాత్తు, తమ హక్కుల కోసం పోరాడుతున్న ఫాలస్తీనా ప్రజలు టెర్రరిస్టులని పేర్కొనబడుతుండగా, నిస్సహాయులైన ఫాలస్తీనా ప్రజలను దుర్మార్గంగా అణచి వేస్తుండటమే కాకుండా తమ స్వంత ప్రజలపై కూడా దౌర్జన్యాలు చేస్తున్న సాయుధ ఇస్రాయీలీ దురాక్రణదారులు మాత్రం టెర్రరిస్టులుగా పేర్కొనబడటం లేదు. ముస్లిమేతర టెర్రరిస్టులు చేసిన ఓక్లహామా సిటీ బాంబింగ్ కేసులో వలే అనేక చోట్ల ఎలాంటి ఆధారాలు లేకుండా మరియు అసలు విచారణ మొదలు కాకుండానే మీడియాలో ముస్లింలను దోషులుగా నిలబెడుతున్నారు. కొన్నిసార్లు శాంతిని కోరుకునేవారు మరియు శాంతిని వ్యతిరేకించేవారు ఉభయులూ ఒకే ధర్మానికి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. 29- “ఇస్లామీయ ఫండమెంటలిజమ్” అంటే ఏమిటి?ఇస్లాం ధర్మంలో “ఫండమెంటలిజం” అనే భావనే లేదు. ప్రాథమిక ఫండమెంటల్ ఇస్లామీయ నియమ నిబంధనల వైపు మరలే మరియు వాటికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకోవాలనుకునే ముస్లింలపై ఒక రకమైన ముద్ర వేస్తూ పాశ్చాత్య మీడియా ఈ పదాన్ని తయారు చేసింది. ఇస్లాం ధర్మం ఒక ..... ధర్మం మరియు అల్లాహ్ అంటే భయభక్తులు చూపే ధర్మం. ఒక ముస్లిం అస్సలు తీవ్రవాది లేదా ఉగ్రవాది ఎంత మాత్రమూ కాజాలడు. ఇస్లాం ధర్మం మితవాదం మరియు తీవ్రవాదానికి మధ్యలో ఉన్న మార్గం. ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క భయభక్తులు కలిగి ఉండాలని బోధిస్తున్న సజీవ ధర్మం. ఒక ముస్లిం అస్సలు తీవ్రవాది, మూఢవిశ్వాసి లేదా ఉగ్రవాది కాజాలడు. 30- ఇస్లాం లోని వివాహ వ్యవస్థ, క్రైస్తవ మతంలోని వివాహ వ్యవస్థకు మధ్య భేదమున్నదా?అవును, భేదమున్నది. ఇస్లాం ధర్మంలో, వివాహమనేది ఒక స్త్రీ మరియు ఒక పురుషుడి మధ్య కలిసి మెలిసి బాధ్యతలు పంచుకుంటూ జీవితం సాగించేందుకు జరిగే ఒక పవిత్ర ఒడంబడిక. దీంతో పాటు, ఇస్లాం ధర్మంలోని వివాహ వ్యవస్థలో ఆచరణాత్మకంగా ఆ ఇరువురి మధ్య వారు పరస్పరం అంగీకరించిన విషయాలతో ఒక చట్టపరమైన అగ్రిమెంటు లిఖించబడుతుంది. ఇస్లాం ధర్మంలో, పెళ్ళికూతురు లేదా పెళ్ళి కొడుకు ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేయలేరు. పెళ్ళి కుదర్చటంలో తల్లిదండ్రుల పాత్ర కేవలం కాబోయే భార్యాభర్తలకు మంచి సలహా ఇవ్వటం వరకే పరిమితం అయి ఉన్నది. అంతేగాని వారు తమ పిల్లలపై తమ నిర్ణయాన్ని రుద్దే ప్రయత్నం చేయకూడదు. 31- ఇస్లాం ధర్మం బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తుందా?ఎంత మాత్రమూ కాదు. ఇస్లాం ధర్మం బహుభార్యాత్వానికి అనుమతినిచ్చిందే గానీ అది తప్పనిసరి అని ఆదేశించలేదు. చారిత్రకంగా, అసలు పెళ్ళి చేసుకోని ఒక్క జీసస్ అలైహిస్సలాం తప్ప, ప్రవక్తలందరూ ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండేవారు. ఒకరి కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండే అనుమతి ఖుర్ఆన్ లో ఇవ్వబడింది. పురుషులకు ఇవ్వబడిన బహుభార్యాత్వం అనుమతి వారి కామవాంఛల్ని చల్లార్చుకోవడానికి కాదు. అది యుద్ధాలలో భర్తను కోల్పోయిన విధవరాళ్ళ మరియు అనాధ పిల్లల శ్రేయస్సు కోసం మాత్రమే. ఇస్లాం ధర్మానికి పూర్వం పురుషులు లెక్కలేనంత మంది భార్యలను కలిగి ఉండేవారు. ఇస్లాం ధర్మం మాత్రమే నలుగురి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండరాదనే నియమాన్ని ఆదేశించింది. ఉదాహరణకు, ఒక వ్యక్తి 11 మంది భార్యలను కలిగి ఉండేవాడు. ముస్లింగా మారిన తర్వాత, అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో, “నా అనేక మంది భార్యలను ఏమి చేయాలి?” అని ప్రశ్నించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు, “నలుగురికి తప్ప మిగిలిన వారందరికీ విడాకులు ఇవ్వు.” ఖుర్ఆన్ ఇలా ప్రకటించింది, “నీవు ఇద్దరిని, లేక ముగ్గురిని లేక నలుగురిని పెళ్ళి చేసుకోవచ్చు, ఒకవేళ నీవు ప్రతి ఒక్కరి మధ్య సరిసమానంగా న్యాయం చేయగలిగితే” (4:3). భార్యలందరి మధ్య సరిసమానంగా న్యాయం చేయడం చాలా కష్టమైన పని కాబట్టి, అనేక మంది ముస్లింలు ఒక్క భార్యతోనే సరిపెట్టుకుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన 24వ సంవత్సరం వయస్సు నుండి 50 ఏళ్ళ వయస్సు వరకు కేవలం ఖదీజా రదియల్లాహు అన్హా అనే పేరుగల ఒకే భార్యతో జీవించారు. పాశ్చాత్య సమాజాలలో, చట్టపరంగా ఒకే భార్యను కలిగి ఉన్నా, అనేక మంది స్త్రీలతో కొందరు పురుషులు వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు. “ﷻ.S.A. Today” (ఏప్రిల్ 4, 1988 సెక్షన్ D) లో ప్రచురించబడిన ఒక సర్వేలో ఎలాంటి స్థానం కోరుకుంటున్నారని 4,700 మంది ఉంపుడుగత్తెలను (సెక్స్ వర్కర్లను) వారు ప్రశ్నించగా, “తాము ‘వేరే స్త్రీ’గా జీవించే బదులు రెండో భార్యగా జీవించడాన్ని ఇష్టపడుతున్నామని, ఎందుకంటే వారికి ఎలాంటి చట్టపరమైన హక్కులు గానీ, చట్టబద్ధంగా పెళ్ళాడిన భార్యలకు లభించే ఆర్థికపరమైన సరిసమాన హక్కులు గానీ లేవని, పురుషులు కేవలం తమ కామవాంఛలు తీర్చుకోవడానికే తమను వాడుకుంటున్నారని భావిస్తున్నామని” వారు జవాబిచ్చారు. 32- ఇస్లాం ధర్మం ముస్లిం మహిళలను అణిచి పెడుతున్నదా?అస్సలు కాదు. వాస్తవం ఏమిటంటే మీడియాలో కొందరు వ్యాపింపజేస్తున్న తప్పుడు ప్రచారాలకు విరుద్ధంగా, ఇస్లాం ధర్మం 1,400 సంవత్సరాలకు పూర్వమే విడాకులు పొందే హక్కు, ఆర్ధిక స్వాతంత్ర్య హక్కు, హిజాబ్ ధరించడం ద్వారా శీలవతిగా గౌరవింపబడే మరియు గుర్తింపబడే హక్కులు ఇచ్చి స్త్రీల స్థాయిని ఉన్నత పరిచింది. ఆ కాలంలో యూరోపుతో సహా ఇతర ప్రాంతాలలో మహిళలకు ఎలాంటి హక్కులూ ఉండేవి కావు. “అన్నిరకాల ఆరాధనలలో, దైవభక్తిలో మహిళలు పురుషులతో సరిసమానంగా ఉన్నారు” (ఖుర్ఆన్ 33:32). ఇస్లాం ధర్మం పెళ్ళి తర్వాత కూడా మహిళలకు తమ ఇంటిపేరును అలాగే కొనసాగించే అనుమతినిచ్చింది, తమ సంపాదనను తమ వద్ద ఉంచుకునే మరియు తమ ఇష్టానుసారం ఖర్చు పెట్టుకునే అనుమతినిచ్చింది, ఇంటి నుండి బయటకి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి మానమర్యాదలు కాపాడాలని పురుషులను ఆదేశించింది. ఎందుకంటే వీధులలో పోకిరీ వెధవలు వారి వెంటపడే అవకాశం ఉన్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింతో ఇలా పలికారు, “తన కుటుంబంతో ఉత్తమంగా ప్రవర్తించే వ్యక్తే మీలో ఉత్తముడు.” ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా కొందరు ముస్లిం పురుషులు తమ మహిళలను అణచి వేస్తున్నారు. అది వారి వారి ఆచారం, సంప్రదాయం లేదా ధర్మం గురించి తెలియని వారి అజ్ఞానం మాత్రమే. 33- ఇస్లాం ధర్మం అన్యమతాల అల్పసంఖ్యాకులను ద్వేషిస్తుందా ?ఎన్నడూ కాదు, ఇస్లాం అన్యమతాల అల్పసంఖ్యాకకుల హక్కులను గుర్తిస్తుంది మరియు ధృవీకరిస్తుంది. వారి మంచి కోసం, భద్రత కోసం మరియు క్షేమం కోసం, వారిపై జిజియా పన్ను విధించింది. అన్యమతాల దేవాలయాలను, చర్చీలను కూలగొట్టవద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీయ సైన్యాన్ని ఆదేశించారు. ఖలీఫా ఉమర్ అయితే ముస్లింలకు చర్చీలలో నమాజు చేసుకునే అనుమతిని కూడా ఇవ్వలేదు. స్పెయిన్ లో యూదులను స్వాగతించారు మరియు వారు వర్ధిల్లేలా ముస్లింలు సహాయపడినారు. అయితే ఆ కాలంలో యూరోపులోని మిగిలిన ప్రాంతాలలో యూదులు ఊచకోతకు గురవుతూ ఉండగా, స్పెయిన్ లోని ముస్లిం పరిపాలకుల కాలాన్ని యూదులు తమ స్వర్ణయుగంగా పేర్కొనేవారు. ఇస్లామీయ దేశాలలో క్రైస్తవులు సుఖశాంతులతో జీవించారు, ప్రభుత్వాలలో ఉన్నత పదవులు పొందారు, చర్చీల ప్రార్థనలలో స్వేచ్ఛగా పాల్గొన్నారు. అయితే, ముస్లిమేతర రాజ్యాలలో అల్పసంఖ్యలో ఉన్న ముస్లింలకు అలాంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించలేదు. ఉదాహరణకు, పూర్వం స్పెయిన్ ను ఆక్రమించిన క్రూసేడుల కాలం మరియు ఈనాడు బోస్నియా, ఇస్రాయీల్, ఇండియాలలో ముస్లింలపై జరుగుతున్న మారణహోమం మరియు అణచివేతలు. ఒక్కోసారి, కొందరు నాయకుల చర్యలు అతని ధర్మబోధనలను సూచించవనే విషయం ముస్లింలకు కూడా తెలుసు. 34- క్రింది అంశాలపై ఇస్లామీయ దృక్పథం ఏమిటి?a. డేటింగ్ ల పేరుతో స్త్రీపురుషులు విచ్చలవిడిగా కలుసుకోవడం మరియు పెళ్ళికాకుండానే సంభోగించడం:ఇస్లాంలో ఎన్నడూ స్త్రీపురుషుల అనైతిక సన్నిహిత సంబంధాలకు అనుమతి లేదు. అంతేగాక పెళ్ళికి ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం మరియు వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం మొదలైన వాటిని ఇస్లాం ధర్మం పూర్తిగా నిషేధించింది. దురాకర్షణలు, చెడు ప్రేరణల నుండి కాపాడే ఒక రక్షణ కవచంగా మరియు పరస్పర ప్రేమాభిమానాలు మరియు శాంతిసుఖాలు వర్ధిల్లే మాధ్యమంగా వివాహబంధాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. b. భ్రూణహత్యలు:గర్భవిచ్ఛిత్తి లేదా భ్రూణహత్యలను ఇస్లాం ధర్మం నిజమైన హత్యలుగా పరిగణిస్తుంది. తల్లి ప్రాణం కాపాడే స్థితిలో తప్ప, అలాంటి వాటిని ఎన్నడూ అనుమతించదు (ఖుర్ఆన్ 17:23-31, 6:15 1).c. స్వలింగ సంపర్కం మరియు ఎయిడ్స్:స్వలింగ సంపర్కాన్ని ఇస్లాం ధర్మం స్పష్టంగా వ్యతిరేకిస్తున్నది మరియు నిషేధిస్తున్నది. దానిని ఒక పాపంగా పరిగణిస్తున్నది. అయితే జాలితో, కనికరంతో ఇతర రోగులకు చికిత్స చేసినట్లుగానే ఎయిడ్స్ రోగులకు కూడా చికిత్స చేయాలని ముస్లిం డాక్టర్లకు సలహా ఇస్తున్నది. d. బాధానివారణ కోసం చంపడం (మెర్సీ కిల్లింగ్) మరియు ఆత్మహత్య చేసుకోవడం (సూసైడ్) :బాధానివారణ కోసం చంపడం మరియు ఆత్యహత్యలు రెండింటినీ ఇస్లాం ధర్మం వ్యతిరేకిస్తున్నది. అంతిమ దశలో ఉన్న రోగల దుఃఖాన్ని మరింత ఎక్కువ చేసే అలాంటి అనవసరమైన ఘనకార్యాలను ముస్లింలు నమ్మరు. e. శరీర అవయవాల మార్పిడి :ఒకరి ప్రాణాలు కాపాడాలని ఇస్లాం ధర్మం నొక్కి చెబుతున్నది (ఖుర్ఆన్ 5:32); కాబట్టి, సామాన్యంగా మానవ శరీర అవయవాల మార్పిడిని ఇస్లాం ధర్మం అనుమతిస్తున్నది. అయితే తమ ఇష్టానుసారం మాత్రమే దాతలు తమ అవయవాలను అవసరమైన వారికి దానం చేయాలి. అయితే, అమ్మకం లేదా వేరే లాభం కోసం అనుమతించబడలేదు. 35- యూదులు మరియు క్రైస్తవులతో ముస్లింలు ఎలా వ్యవహరిస్తారు ?దివ్యఖుర్ఆన్ వారిని “గ్రంథ ప్రజలు” అని సంబోధిస్తున్నది, అంటే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు దివ్యసందేశాన్ని అందుకున్నారు. వారిని గౌరవించాలని, న్యాయంగా వ్యవహరించాలని మరియు వారు స్వయంగా ఇస్లాంకు వ్యతిరేకంగా విరోధం చూపడం లేదా ఇస్లాంను ఎగతాళి చేయడం వంటివి చేయనంత వరకు వారితో పోరాడకూడదని ముస్లింలకు ఆదేశించబడింది. ఏదో ఒకనాడు వారు కూడా అల్లాహ్ ను ఆరాధించడంలో తమతో పాటు కలిసి ముందడుగు వేస్తారేమో మరియు అల్లాహ్ కు సమర్పించుకుంటారేమోనని చివరికి ముస్లింలు వారిపై ఆశ పడుతున్నారు. “(ఓ ముహమ్మద్) వారికి చెప్పు: ఓ గ్రంథ ప్రజలారా! మాలోనూ, మీలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్ ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్ ను వదిలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు. ఈ ప్రతిపాదన పట్ల గనుక వారు విముఖత చూపితే, “మేము మాత్రం ముస్లింలము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి.” (ఖుర్ఆన్ 3:64)మరి హిందువులు, బహాయి, బౌద్ధులు మరియు ఇతర ధర్మాలను అనుసరించే ప్రజలతో ఎలా వ్యవహరించాలి? వారితో కూడా కనికరం, దయ, గౌరవమర్యాదలతో వ్యవహరించాలి మరియు ఇస్లాం ధర్మం వైపు పిలుస్తున్న తమ ఆహ్వానం వారికి అర్థం అయ్యేలా మంచిగా ప్రవర్తించాలి. 36- మానవ హక్కుల గురించి ఇస్లాం ధర్మం ఏ విధంగా గ్యారంటీ ఇస్తున్నది ?ఖుర్ఆన్ లో ఏ ధర్మాన్నైనా అనుసరించే స్వేచ్ఛాస్వాతంత్ర్యాల గురించి స్పష్టమైన ప్రకటన ఉన్నది : ‘ధర్మంలో ఎలాంటి బలవంతం లేదు’. (2:256)ముస్లిం లేదా ముస్లిమేతరుడు అనే భేదభావం లేకుండా ప్రజలందరి ప్రాణాలు మరియు సంపదలను ఇస్లాం ధర్మం చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తున్నది. ‘ఓ మానవులారా! మేము మిమ్ముల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్ముల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడూ, అప్రమత్తుడూను. (ఖుర్ఆన్ 49:13) 37- ముస్లిం కొరకు కుటుంబ వ్యవస్థ ఎందుకు అంతగా ముఖ్యమైనది ?కుటుంబమనేది ఇస్లామీయ సమాజం యొక్క పునాది వంటిది. ఒక నిలకడైన కుటుంబ యూనిట్ సమాజానికి అందించే శాంతిభద్రతలు చాలా విలువైనవి. ఆ కుటుంబ సభ్యుల అధ్యాత్మిక అభివృద్ది కోసం అవి ఎంతో అవసరమైనవి. విస్తృత కుటుంబాల ఉనికి వలన సామరస్యపూర్వకమైన సామాజిక క్రమం సృష్టించబడుతుంది; పిల్లలు సరైన పెంపకం లభించడం వలన మంచిగా పరిపక్వం చెందుతారు, పెళ్ళయ్యే వరకు ఇంటిపట్టానే ఉంటారు. పెళ్ళికి ముందు చాలా అరుదుగా ఇంటిని వదిలి పెడతారు. 38- వయసు మళ్ళిన పెద్దలతో ముస్లింలు ఎలా వ్యవహరిస్తారు?ఇస్లామీయ సమాజంలో, వృద్ధాశ్రమాలే లేవు. వయసు మళ్ళిన తల్లిదండ్రులకు జాగ్రత్తగా ప్రేమతో సేవలందించడంలో శ్రమించడమనేది ఒక గౌరవమైన మరియు ఆశీర్వాదాలతో, దీవెనలతో నిండిన ఉత్తమ పనిగా, అధ్యాత్మికంగా ఉత్తమ స్థానానికి చేరుకునే అవకాశంగా ఇస్లాం ధర్మం పరిగణిస్తున్నది. మన తల్లిదండ్రుల కోసం ప్రార్థించడమే కాకుండా నిస్సహాయులైన పసిబిడ్డలుగా ఉన్నప్పుడు వారు తమ అవసరాల కంటే ఎక్కువగా మనకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని మరీ వారికి అపరిమితమైన కనికరం, దయ, ప్రేమాభిమానాలతో సేవలు చేయాలని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. తల్లి స్థానం తండ్రి స్థానం కంటే ఒకంత ఉన్నతమైంది. అందువలన వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమించాలి మరియు గౌరవించాలి. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, ‘తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నది’.ఇస్లాం ధర్మంలో, తల్లిదండ్రులకు సేవలు చేయడమనేది నమాజుల తర్వాత స్థానంలో ఉన్న గొప్ప బాధ్యత. అంతేగాని, అది వారికి చేస్తున్న ఉపకారం ఎంత మాత్రమూ కాదు, అది మనపై వారికి ఉన్న తిరుగులేని హక్కు. ఖుర్ఆన్ లోని ప్రకటన ఇలా ఉన్నది: ‘నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరు గాని, ఇద్దరు గానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే, వారి ముందు (విసుగ్గా) “ఊహ్” అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు. అణుకువ, దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణచి పెట్టు. “ఓ ప్రభూ! బాల్యంలో వీరు నన్ను (ప్రేమానురాగాలతో) పోషించినట్లుగానే నీవు వీరిపై దయజూపు” అని వారికోసం ప్రార్థిస్తూ ఉండు. (ఖుర్ఆన్ 17:23-24) 39- ఆహారపదార్థాల గురించి ఏమిటి?యూదులు మరియు తొలితరం క్రైస్తవులు అనుసరించిన ఆహారపదార్థాలకు సంబంధించిన నియమనిబంధనల కంటే ఇస్లామీయ నిబంధనలు చాలా సులభమైనవే అయినా, పంది మాసం మరియు మత్తుపదార్థాల దరిదాపులకు కూడా పోకూడదని ముస్లింలు నిషేధిస్తున్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ‘మీ శరీరానికి మీపై హక్కు ఉన్నది’, ఇస్లాం ధర్మంలో ఆరోగ్యవంతమైన ఆహారపానీయాలు సేవించడం మరియు ఆరోగ్యవంతమైన జీవన శైలిని అనుసరించడం మొదలైనవి ధార్మిక విధులుగా చూడబడుతున్నాయి. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ‘తప్పకుండా మీరు (దైవవిశ్వాసంలో) నిలకడతనం, మంచిగా ఉండటం కోసం అల్లాహ్ ను వేడుకోండి; ఎందుకంటే (దైవవిశ్వాసంలో) నిలకడతనం తర్వాత, ఆరోగ్యం కంటే ఉత్తమమైన ఏ బహుమతీ ఎవ్వరికీ ఇవ్వబడలేదు!’ 40- ఎవరైనా ముస్లింగా మారవచ్చా? తప్పకుండా, ఎవరైనా ముస్లింగా మారవచ్చు. దీని కోసం రెండు ప్రకటనలు చేయవలసి ఉంటుంది. ఎవరైనా ఇస్లాంలో ప్రవేశించాలంటే ఇలా క్రింది సాక్ష్యప్రకటనలు చేయడం తప్పనిసరి:1. నేను సాక్ష్యమిస్తున్నాను - అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గలవాడెవ్వడూ లేడు.2. నేను సాక్ష్యమిస్తున్నాను – ముహమ్మద్, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). 3. కాబట్టి, ఎవరైతే ఎలాంటి బలవంతం లేకుండా, ఎలాంటి ప్రాపంచిక లాభాపేక్షా లేకుండా స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా పై రెండు సాక్ష్యప్రకటనలు పలుకుతారో, వారు ముస్లింలు మారిపోతారు. అయితే ఈ రెండు సాక్ష్యప్రకటనలను అరబీ భాషలో ఇలా పలుక వలసి ఉన్నది – “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్”. ఇలా సాక్ష్యప్రకటన పలకడానికి ముందు ఈ నవముస్లిం తలస్నానం చేయడం మంచిది.తర్వాత ఏమి చేయాలి ?ముస్లింగా మారిన తర్వాత, అతడు / ఆమె, ఒక ముస్లింగా ప్రతిరోజు ఐదుపూటలా చేయవలసిన నమాజులు, రమదాన్ నెల ఉపవాసాలు, జకాతు విధిదానం, హజ్ యాత్ర మొదలైన ఇస్లామీయ మూలస్థంభాల గురించి నేర్చుకోవాలి, ఆ తర్వాత ఏమి చేయాలి ?ముస్లింలు సోదరసోదరీమణులు. స్వయంగా తనకోసం దేనినైతే ఇష్టపడతాడో, ఒక ముస్లిం తన తోటి సోదరుడు / సోదరి కోసం కూడా దానినే ఇష్టపడాలి. అల్లాహ్ వద్ద నున్న సంపదలు కరిగిపోవు. ఆయన మనందరికీ ప్రసాదించగలిగే సాటిలేని శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నాడు. కాబట్టి, మనం పరస్పరం ఒకరి మంచి కొరకు మరొకరు ప్రార్థించుదాము, పరస్పరం ప్రేమించుదాము. మన కోసం దేనినైతే ఇష్టపడతామే, దానినే ఇతర సోదరసోదరీమణుల కోసం కూడా ఇష్టపడదాము[3]. References1. Discover Islam ,complimentary copy by: shekka Hind Al-Maktoum . ﷻ.A.E2. This Message is for You ,by :Mahmoud Murad , cooperative office for call and guidance .K.S.A3. The True Religion of God Dr P, Philips, zaid center for new Muslims . ﷻ.A.E.4. The Principles of Islam, by: Hmoud Al-lahim, cooperative office for call and guidance .K.S.A5. The Personality of Allah’s Last Messenger , by: Abdul Waheed Khan ,IIPH .http://purposeoflife.info/40-top-questions-about-islam/#what-is-islam[1]. Khan,The personality of Allah’s last messenger , p (17-34) [2]. www:Islamichotline.com [3]. www: Islamicfinder.org