العزيز
كلمة (عزيز) في اللغة صيغة مبالغة على وزن (فعيل) وهو من العزّة،...
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు (నిత్యుడు), విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు.
ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో నుండి (మిగిలి వున్న సత్యాన్ని) ధృవపరుస్తోంది. మరియు ఆయనే తౌరాత్ ను మరియు ఇంజీలును అవతరింపజేశాడు.
దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.
నిశ్చయంగా, భూమిలో గానీ మరియు ఆకాశాలలో గానీ, అల్లాహ్ కు గోప్యంగా ఉన్నది ఏదీ లేదు.
ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చి దిద్దుతాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
ఆయన (అల్లాహ్) యే నీపై (ఓ ముహమ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ముహ్ కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి. కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటబడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ, పరిపక్వ జ్ఞానం గలవారు: "మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!" అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.
(వారు ఇలా అంటారు): "ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తరువాత మా హృదయాలను వక్రమార్గం వైపునకు పోనివ్వకు. మరియు మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు.
"ఓ మా ప్రభూ! నిశ్చయంగా నీవే మానవులందరినీ నిస్సందేహంగా రాబోయే ఆ దినమున సమావేశపరచే వాడవు. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగం చేయడు."
నిశ్చయంగా, సత్యతిరస్కారులైన వారికి వారి ధనం గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ కు ప్రతికూలంగా ఏ మాత్రం పనికిరావు. మరియు ఇలాంటి వారే నరకాగ్నికి ఇంధనమయ్యేవారు.
వారి ముగింపు ఫిర్ఔను జాతి మరియు వారికి ముందున్న వారి వలే ఉంటుంది. వారు మా సూచనలను (ఆజ్ఞలను) తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా, వారిని పట్టుకున్నాడు. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు.
(ఓ ప్రవక్తా!) సత్యాన్ని తిరస్కరించిన వారితో అను: "మీరు త్వరలోనే లొంగదీయబడి నరకంలో జమ చేయబడతారు. మరియు అది అతి చెడ్డ విరామ స్థలము!"
వాస్తవానికి (బద్ర్ యుద్ధ రంగంలో) మార్కొనిన ఆ రెండు వర్గాలలో మీకు ఒక సూచన ఉంది. ఒక వర్గం అల్లాహ్ మార్గంలో పోరాడేది మరియు రెండవది సత్యతిరస్కారులది. వారు (విశ్వాసులు) వారిని (సత్యతిరస్కారులను) రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తమ కళ్ళారా చూశారు. మరియు అల్లాహ్ తాను కోరిన వారిని తన సహాయంతో (విజయంతో) బలపరుస్తాడు. నిశ్చయంగా, దూరదృష్టి గలవారికి ఇందులో ఒక గుణపాఠముంది.
స్త్రీలు, సంతానం మరియు కూర్చిపెట్టిన వెండి-బంగారు రాసులు, మేలు జాతి గుర్రాలు, పశువులు, పొలాలు మొదలైన మనోహరమైన వస్తువుల ప్రేమ ప్రజలకు ఆకర్షణీయంగా చేయబడింది. ఇదంతా ఇహలోక జీవనభోగం. కానీ, అసలైన గమ్యస్థానం అల్లాహ్ వద్దనే ఉంది.
ఇలా చెప్పు: "ఏమీ? వాటి కంటే ఉత్తమమైన వాటిని నేను మీకు తెలుపనా? దైవభీతి గలవారికి, వారి ప్రభువు వద్ద స్వర్గవనాలుంటాయి.
వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు మరియు వారికి అక్కడ పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు మరియు వారికి అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది." మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.
ఎవరైతే : "ఓ మా ప్రభూ! మేము నిశ్చయంగా విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు మరియు నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించు." అని పలుకుతారో!
(అలాంటి వారే!) సహనశీలురు, సత్యవంతులు మరియు వినయ విధేయతలు గల వారు, దానపరులు మరియు వేకువ జామున తమ పాపాలకు క్షమాపణ వేడుకునేవారు.
నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. కాని పూర్వ గ్రంథ ప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి).
(ఓ ప్రవక్తా!) వారు నీతో వివాదమాడితే ఇట్లను: "నేనూ మరియు నా అనుచరులు అల్లాహ్ ప్రీతి పొందటానికి ఆయనకు సంపూర్ణంగా విధేయులం (ముస్లిములం) అయ్యాము." మరియు గ్రంథ ప్రజలతో మరియు నిరక్ష్యరాస్యులతో (చదువురాని అరబ్బులతో): "ఏమీ? మీరు కూడా విధేయులయ్యారా?" అని అడుగు. వారు విధేయులైతే సన్మార్గం పొందిన వారవుతారు. కాని ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే! మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.
నిశ్చయంగా, అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపే వారికి మరియు న్యాయసమ్మతంగా వ్యవహరించమని బోధించే ప్రజలను చంపే వారికి, బాధాకరమైన శిక్ష ఉందని తెలియజెయ్యి.
అలాంటి వారి కర్మలు ఇహలోక మందును మరియు పరలోక మందును వృథా అవుతాయి. మరియు వారికి సహాయకులు ఎవ్వరూ ఉండరు.
ఏమీ? గ్రంథంలోని కొంతభాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా ? వారి మధ్య తీర్పు చేయటానికి, అల్లాహ్ గ్రంథం వైపునకు రండి అని, వారిని ఆహ్వానించినపుడు, వారిలోని ఒక వర్గం వారు విముఖులై, వెనుదిరిగి పోతారు.
వారు అలా చేయటానికి కారణం వారు: "నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది." అనటం. మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది.
నిస్సందేహంగా, రాబోయే ఆ (పునరుత్థాన) దినమున, మేము వారిని సమావేశ పరచినపుడు, వారి స్థితి ఎలా ఉంటుందో (ఆలోచించారా?) మరియు ప్రతి జీవికి తాను చేసిన కర్మల ఫలితం పూర్తిగా నొసంగబడుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.
ఇలా అను: "ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపతి! నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని రాజ్యాధికారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని (శక్తిని) ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. నీ చేతిలోనే మేలున్నది. నిశ్చయంగా, నీవు ప్రతిదీ చేయగల సమర్ధుడవు.
"నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు. మరియు నీవు సజీవులను నిర్జీవుల నుండి తీస్తావు మరియు నిర్జీవులను సజీవుల నుండి తీస్తావు. మరియు నీవు కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తావు."
విశ్వాసులు - తమ తోటి విశ్వాసులను విడిచి - సత్యతిరస్కారులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవారికి అల్లాహ్ తో ఏ విధమైన సంబంధం లేదు. కాని, వారి దౌర్జన్యానికి భీతిపరులైతే తప్ప! అల్లాహ్ (ఆయనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు అల్లాహ్ వైపుకే మీ మరలింపు ఉంది.
వారితో ఇలా అను: "మీరు మీ హృదయాలలో ఉన్నది దాచినా వెలిబుచ్చినా, అది అల్లాహ్ కు తెలుస్తుంది. మరియు భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు."
ఆ రోజు ప్రతి ప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు తనకు మరియు దానికి మధ్య దూరం ఉంటే, ఎంత బాగుండేదని ఆశిస్తుంది. మరియు అల్లాహ్ (తనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల ఎడల ఎంతో కనికరుడు.
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత."
(ఇంకా) ఇలా అను: "అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. "వారు కాదంటే! నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులను ప్రేమించడు, (అని తెలుసుకోవాలి).
నిశ్చయంగా అల్లాహ్, ఆదమ్ ను నూహ్ ను, ఇబ్రాహీమ్ సంతతి వారిని మరియు ఇమ్రాన్ సంతతివారిని (ఆయా కాలపు) సర్వలోకాల (ప్రజలపై) ప్రాధాన్యతనిచ్చి ఎన్నుకున్నాడు.
వారంతా ఒకే పరంపరకు చెందినవారు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
ఇమ్రాన్ భార్య ప్రార్థించింది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా గర్భము నందున్న శిశువును నీ సేవకు అంకితం చేయటానికి మొక్కుకున్నాను, కావున నా నుండి దీనిని తప్పక స్వీకరించు. నిశ్చయంగా నీవే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు."
తరువాత ఆమె ఆడ శిశువు (మర్యమ్) ను ప్రసవించినప్పుడు, ఆమె ఇలా విన్నవించుకున్నది: "ఓ నా ప్రభూ! నేను ఆడ శిశువును ప్రసవించాను" - ఆమె ప్రసవించినదేమిటో అల్లాహ్ కు బాగా తెలుసు మరియు బాలుడు బాలిక వంటి వాడు కాడు - "మరియు నేను ఈమెకు మర్యమ్ అని పేరు పెట్టాను. మరియు నేను ఈమెను మరియు ఈమె సంతానాన్ని శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి రక్షించటానికి, నీ శరణు వేడుకుంటున్నాను!"
ఆ తరువాత ఆ బాలికను, ఆమె ప్రభువు ఆదరంతో స్వీకరించి, ఆమెను ఒక మంచి స్త్రీగా పెంచాడు మరియు ఆమెను 'జకరియ్యా సంరక్షణలో ఉంచాడు.
జకరియ్యా ఆమె గదికి పోయినప్పుడల్లా, ఆమె వద్ద (ఏవో కొన్ని) భోజన పదార్థాలను చూసి, ఆమెను ఇలా అడిగేవాడు: "ఓ మర్యమ్, ఇది నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చింది?" ఆమె ఇలా జవాబిచ్చేది: "ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చింది." నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి లెక్క లేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.
అప్పుడు జకరియ్యా తన ప్రభువును ప్రార్థించాడు. అతను ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నీ కనికరంతో నాకు కూడా ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే ప్రార్థనలను వినేవాడవు."
తరువాత అతను (జకరియ్యా) తన గదిలో నిలబడి నమాజ్ చేస్తున్నప్పుడు దేవదూతలు: "నిశ్చయంగా, అల్లాహ్ నీకు యహ్యా యొక్క శుభవార్తను ఇస్తున్నాడు. అతను, అల్లాహ్ వాక్కును ధృవ పరుస్తాడు. అతను మంచి నాయకుడు మరియు మనో నిగ్రహం గల ప్రవక్త అయి సద్వర్తనులలో చేరిన వాడవుతాడు." అని వినిపించారు.
అతను (జకరియ్యా) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు, నాకు ముసలితనం వచ్చింది మరియు నా భార్యనేమో గొడ్రాలు!" ఆయన అన్నాడు: "అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరింది చేస్తాడు."
అతను (జకరియ్యా) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! నా కొరకు ఏదైనా సూచన నియమించు." ఆయన జవాబిచ్చాడు: "నీకు సూచన ఏమిటంటే, నీవు మూడు రోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడలేవు. నీవు ఎక్కువగా నీ ప్రభువును స్మరించు. మరియు సాయంకాలము నందును మరియు ఉదయము నందును ఆయన పవిత్రతను కొనియాడు."
మరియు దేవదూతలు: "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు. మరియు నిన్ను పరిశుద్ధ పరిచాడు. మరియు (నీ కాలపు) సర్వలోకాలలోని స్త్రీలలో నిన్ను ఎన్నుకున్నాడు." అని అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి).
(వారింకా ఇలా అన్నారు): "ఓ మర్యమ్! నీవు నీ ప్రభువుకు విధేయురాలుగా ఉండు. (ఆయన సాన్నిధ్యంలో) సాష్టాంగం (సజ్దా) చెయ్యి. మరియు వంగే (రుకూఉ చేసే) వారితో కలిసి వంగు (రుకూఉ చెయ్యి)."
(ఓ ప్రవక్తా!) ఇవన్నీ అగోచరమైన వార్తలు. వాటిని మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపుతున్నాము. మర్యమ్ సంరక్షకుడు ఎవరు కావాలని వారు (ఆలయ సేవకులు) తమ కలములను విసిరినపుడు, నీవు వారి దగ్గర లేవు మరియు వారు వాదించుకున్నపుడు కూడా నీవు వారి దగ్గర లేవు.
దేవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు. అతని పేరు: "మసీహ్ ఈసా ఇబ్నె మర్యమ్. అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్) సామీప్యం పొందినవారిలో ఒకడై ఉంటాడు.
"మరియు అతను ప్రజలతో ఉయ్యాలలో ఉండగానే మాట్లాడుతాడు మరియు పెద్దవాడైన తరువాత కూడా (మాట్లాడుతాడు) మరియు సత్పురుషులలో ఒకడై ఉంటాడు."
ఆమె (మర్యమ్) ఇలా అన్నది: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు కూడా నన్ను ముట్టలేదే?" ఆయన ఇలా సమాధాన మిచ్చాడు: "అల్లాహ్ తాను కోరింది ఇదే విధంగా సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించినపుడు కేవలం దానిని : 'అయిపో!' అని అంటాడు, అంతే అది అయిపోతుంది."
మరియు ఆయన (అల్లాహ్) అతనికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని మరియు తౌరాతును మరియు ఇంజీలును నేర్పుతాడు.
మరియు అతనిని ఇస్రాయీల్ సంతతి వారి వైపుకు సందేశహరునిగా పంపుతాడు. (అతను ఇలా అంటాడు): "నిశ్చయంగా, నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సూచన (ఆయత్) తీసుకొని వచ్చాను. నిశ్చయంగా, నేను మీ కొరకు మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మను తయారుచేసి దానిలో శ్వాసను ఊదుతాను! అప్పుడది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. మరియు నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని, కుష్ఠురోగిని బాగు చేస్తాను మరియు మృతుణ్ణి బ్రతికిస్తాను. మరియు మీరు తినేది, ఇండ్లలో కూడబెట్టేది మీకు తెలుపుతాను. మీరు విశ్వాసులే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన (ఆయత్) ఉంది.
" మరియు నేను, ప్రస్తుతం తౌరాత్ లో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవ పరచటానికి మరియు పూర్వం మీకు నిషేధించబడిన (హరామ్ చేయబడిన) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్) చేయటానికి (వచ్చాను).
మరియు నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు అద్భుత సూచనలు (ఆయాత్) తీసుకొని వచ్చాను, కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి!
"నిశ్చయంగా, అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము."
ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" (అప్పుడతని) శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు.
"ఓ మా ప్రభూ! నీవు అవతరింప జేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో!"
మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు!
(జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: "ఓ ఈసా! నేను నిన్ను తీసుకుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తుకుంటాను మరియు సత్యతిరస్కారుల నుండి నిన్ను శుద్ధపరుస్తాను మరియు నిన్ను అనుసరించిన వారిని, పునరుత్థాన దినం వరకు సత్యతిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను. చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చేస్తాను.
"ఇక సత్యతిరస్కారులకు ఇహలోకంలో మరియు పరలోకంలోనూ కఠినమైన శిక్ష విధిస్తాను. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు."
మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి (అల్లాహ్) పరిపూర్ణ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులు అంటే ఇష్టపడడు.
(ఓ ముహమ్మద్!) మేము నీకు ఈ సూచనలను (ఆయాత్ లను) వినిపిస్తున్నాము. మరియు ఇవి వివేకంతో నిండిన ఉపదేశాలు.
నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం, ఆదమ్ ఉపమానం వంటిదే. ఆయన (ఆదమ్ ను) మట్టితో సృజించి: "అయిపో!" అని అన్నాడు. అంతే అతను అయిపోయాడు.
ఈ సత్యం నీ ప్రభువు తరఫు నుండి వచ్చింది, కావున నీవు శంకించేవారిలో చేరిన వాడవు కావద్దు.
ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో అతనిని (ఈసాను) గురించి వివాదానికి దిగితే, ఇలా అను: "రండి! మేము మరియు మీరు కలిసి, మా కుమారులను మరియు మీ కుమారులను; మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని, అందరమూ కలిసి: 'అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం (బహిష్కారం) పడుగాక!' అని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము."
నిశ్చయంగా, ఇదే (ఈసాను గురించిన) సత్యగాథ. మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
ఒకవేళ వారు వెనుదిరిగితే! నిశ్చయంగా, అల్లాహ్ కు కల్లలోలం రేకెత్తించే వారిని గురించి బాగా తెలుసు.
ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు." వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు.
ఓ గ్రంథ ప్రజలారా! ఇబ్రాహీమ్ (ధర్మాన్ని) గురించి మీరు ఎందుకు వాదులాడుతున్నారు? తౌరాతు మరియు ఇంజీల్ లు అతని తరువాతనే అవతరించాయి కదా! ఇది మీరు అర్థం చేసుకోలేరా?
అవును, మీరే వారు! తెలిసివున్న విషయాలను గురించి వాదులాడినవారు. అయితే మీకేమీ తెలియని విషయాలను గురించి ఎందుకు వాదులాడుతున్నారు? మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కానీ మీకు ఏమీ తెలియదు.
ఇబ్రాహీమ్ యూదుడూ కాడు మరియు క్రైస్తవుడూ కాడు! కాని అతను ఏకదైవ సిద్ధాంతంపై ఉన్నవాడు (హనీఫ్), అల్లాహ్ కు విధేయుడు (ముస్లిం) మరియు అతడు ఏ మాత్రం (అల్లాహ్ కు) సాటి కల్పించేవాడు (ముష్రిక్) కాడు.
నిశ్చయంగా, ఇబ్రాహీమ్ తో దగ్గరి సంబంధం గల వారంటే, అతనిని అనుసరించే వారు మరియు ఈ ప్రవక్త (ముహమ్మద్) మరియు (ఇతనిని) విశ్వసించిన వారు. మరియు అల్లాహ్ యే విశ్వాసుల సంరక్షకుడు.
గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు, మిమ్మల్ని మార్గభ్రష్టులు చేయాలని కోరుతున్నారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులు చేయటం లేదు, కాని వారది గ్రహించటం లేదు.
"ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు వాటికి మీరే సాక్షులుగా ఉన్నారు కదా!"
"ఓ గ్రంథ ప్రజలారా! తెలిసి ఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పి పుచ్చుతున్నారు? మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు?"
మరియు గ్రంథ ప్రజలలోని కొందరు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): "(ఈ ప్రవక్తను) విశ్వసించిన వారిపై (ముస్లింలపై) అవతరింపజేయబడిన దానిని ఉదయం విశ్వసించండి మరియు సాయంత్రం తిరస్కరించండి. (ఇలా చేస్తే) బహుశా, వారు కూడా (తమ విశ్వాసం నుండి) తిరిగి పోతారేమో!"
మరియు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): "మీ ధర్మాన్ని అనుసరించే వారిని తప్ప మరెవ్వరినీ నమ్మకండి." (ఓ ప్రవక్తా!) నీవు వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ మార్గదర్శకత్వమే సరైన మార్గదర్శకత్వం." (వారు ఇంకా ఇలా అంటారు): "మీకు ఇవ్వబడినటువంటిది ఇంకెవరికైనా ఇవ్వబడుతుందని, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీతో వాదిస్తారని, (నమ్మకండి)." వారితో అను: "నిశ్చయంగా, అనుగ్రహం అల్లాహ్ చేతిలోనే ఉంది; ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు."
ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో, సర్వోత్తముడు.
మరియు గ్రంథ ప్రజలలో ఎలాంటి వాడున్నాడంటే: నీవు అతనికి ధనరాసులు ఇచ్చినా అతడు వాటిని నమ్మకంగా నీకు తిరిగి అప్పగిస్తాడు. మరొకడు వారిలో ఎలాంటి వాడంటే: నీవతన్ని నమ్మి ఒక్క దీనారు ఇచ్చినా అతడు దానిని - నీవతని వెంట బడితేనే కానీ - నీకు తిరిగి ఇవ్వడు. ఇలాంటి వారు ఏమంటారంటే: "నిరక్ష్యరాస్యుల (యూదులు కాని వారి) పట్ల ఎలా వ్యవహరించినా మాపై ఎలాంటి దోషం లేదు." మరియు వారు తెలిసి ఉండి కూడా అల్లాహ్ ను గురించి అబద్ధాలాడుతున్నారు.
వాస్తవానికి, ఎవడు తన ఒప్పందాన్ని పూర్తి చేసి దైవభీతి కలిగి ఉంటాడో; అలాంటి దైవభీతి గలవారిని నిశ్చయంగా, అల్లాహ్ ప్రేమిస్తాడు.
నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో, అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో మాట్లాడడు మరియు వారి వైపు కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగా చేయడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
మరియు మీరు అది గ్రంథం లోనిదని భావించాలని, వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని (నిజానికి) అది గ్రంథం లోనిది కాదు; మరియు వారు: "అది అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది." అని అంటారు, కాని అది (నిజానికి) అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు, మరియు వారు తెలిసి కూడా అల్లాహ్ పై అబద్ధాలు పలుకుతున్నారు.
ఏ మానవునికైనా అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన తర్వాత అతడు ప్రజలతో: "మీరు అల్లాహ్ కు బదులుగా నన్ను ప్రార్థించండి." అని అనటం తగినది కాదు, కాని వారితో: "మీరు ఇతరులకు బోధించే మరియు మీరు చదివే గ్రంథాల అనుసారంగా ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) కండి." అని అనటం (భావింపదగినది);
మరియు మీరు దేవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్యతిరస్కారులు కమ్మని ఆదేశించగలడా?
మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.
ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో, వారే దుష్టులు (ఫాసిఖూన్).
ఏమీ? వీరు అల్లాహ్ ధర్మం కాక వేరే ధర్మాన్ని అవలంబించగోరుతున్నారా? మరియు భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా ఆయనకే విధేయులై (ముస్లింలై) ఉన్నాయి! మరియు ఆయన వైపునకే అందరూ మరలింపబడతారు.
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మేము అల్లాహ్ ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయబడిన దానిని మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడిన వాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరఫు నుండి (అవతరింపజేయబడిన వాటిని) కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణ చేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."
మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.
అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూపగలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత - మరియు నిశ్చయంగా సందేశహరుడు సత్యవంతుడే, అని సాక్ష్యమిచ్చిన తరువాత మరియు వారి వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా - సత్యతిరస్కారం అవలంబించారో! మరియు అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు.
అలాంటి వారి శిక్ష: నిశ్చయంగా అల్లాహ్ మరియు దేవదూతల మరియు సర్వమానవుల శాపం వారిపై పడటమే!
అందులో (నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్ష ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారికి వ్యవధి కూడా ఇవ్వబడదు.
కానీ, ఇక మీదట ఎవరైతే పశ్చాత్తాప పడి, తమ నడవడికను సరిదిద్దుకుంటారో! అలాంటి వారి యెడల నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తారో మరియు తమ సత్యతిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటి వారే మార్గభ్రష్టులైన వారు.
నిశ్చయంగా, ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ సత్యతిరస్కార స్థితిలోనే మృతి చెందుతారో! వారు భూగోళమంత బంగారం పాపపరిహారంగా ఇవ్వదలిచినా అది అంగీకరించబడదు. అలాంటి వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.
మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మనిష్ఠాపరులు) కాలేరు. మరియు మీరు ఏమి ఖర్చుపెట్టినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది.
ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్ సంతతివారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని, తౌరాత్ అవతరణకు పూర్వం ఇస్రాయీల్ (యఅఖూబ్) తనకు తాను కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారితో ఇట్లను: "మీరు సత్యవంతులే అయితే, తౌరాత్ ను తీసుకొని రండి మరియు దానిని చదవండి."
కావున దీని తర్వాత కూడా ఎవడైనా అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్ కు ఆపాదిస్తే, అలాంటి వారు, వారే దుర్మార్గులు.
ఇలా అను: "అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరు ఏకదైవసిద్ధాంతం (సత్యధర్మం) అయిన ఇబ్రాహీమ్ ధర్మాన్నే అనుసరించండి. మరియు అతను అల్లాహ్ కు సాటి కల్పించేవాడు (ముష్రిక్) కాడు."
నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది.
అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇబ్రాహీమ్ నిలిచిన స్థలం ఉంది. మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం (రక్షణ) పొందుతాడు. మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి).
ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సందేశాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు మీరు చేసే కర్మలన్నింటికీ అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు!"
ఇంకా ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు దానికి (సత్యమార్గానికి) సాక్ష్యులుగా ఉండి కూడా అది వక్రమార్గమని చూప దలచి, విశ్వసించిన వారిని అల్లాహ్ మార్గంపై నడవకుండా ఎందుకు ఆటంక పరుస్తున్నారు? మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు."
ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథ ప్రజల (కొందరి) మాటలు విని వారిని అనుసరిస్తే! వారు మిమ్మల్ని, విశ్వసించిన తరువాత కూడా సత్యతిరస్కారులుగా మార్చి వేస్తారు.
మరియు అల్లాహ్ సందేశాలు మీకు చదివి వినిపించబడుతూ ఉన్నప్పుడు మరియు ఆయన సందేశహరుడు మీలో ఉన్నప్పుడు; మీరు ఎలా సత్యతిరస్కారులు కాగలరు? మరియు మీలో ఎవడు స్థిరంగా అల్లాహ్ ను ఆశ్రయిస్తాడో, అతడు నిశ్చయంగా, ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందినవాడే!
ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్యపాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్ కు విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మరణించకండి!
మీరందరూ కలసి అల్లాహ్ త్రాడు (ఖుర్ఆన్) ను గట్టిగా పట్టుకోండి. మరియు విభేదాలలో పడకండి. అల్లాహ్ మీ యెడల చూపిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు, ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన అనుగ్రహం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మరియు మీరు అగ్నిగుండం ఒడ్డున నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని దాని నుండి రక్షించాడు. ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా మీరు మార్గదర్శకత్వం పొందుతారని!
మీలో ఒక వర్గం, (ప్రజలను) మంచి మార్గం వైపునకు పిలిచేదిగా, ధర్మాన్ని (మంచిని) ఆదేశించేదిగా (బోధించేదిగా) మరియు అధర్మాన్ని (చెడును) నిషేధించేదిగా (నిరోధించేదిగా) ఉండాలి. మరియు అలాంటి వారు, వారే సాఫల్యం పొందేవారు.
స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురి అయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు. మరియు అలాంటి వారికి ఘోరశిక్ష ఉంటుంది.
ఆ (తీర్పు) దినమున కొందరి ముఖాలు (సంతోషంతో) ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొందరి ముఖాలు (దుఃఖంతో) నల్లబడి ఉంటాయి.
ఇక ఎవరి ముఖాలు నల్లబడి ఉంటాయో వారితో: "మీరు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులు అయ్యారు కదా? కాబట్టి మీరు సత్యాన్ని తిరస్కరించినందుకు ఈ శిక్షను అనుభవించండి." (అని అనబడుతుంది).
ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారు అల్లాహ్ కారుణ్యంలో (స్వర్గంలో) ఉంటారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
(ఓ ప్రవక్తా!) ఇవి అల్లాహ్ సూక్తులు (ఆయాత్) మేము వాటిని యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోకాల వారికి అన్యాయం చేయగోరడు.
మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు వ్యవహారాలన్నీ (తీర్పు కొరకు) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి.
మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు. మరియు ఒకవేళ గ్రంథప్రజలు విశ్వసిస్తే, వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే (ఫాసిఖూన్).
వారు మిమ్మల్ని కొంత వరకు బాధించటం తప్ప, మీకు ఏ విధమైన హాని కలిగించజాలరు. మరియు వారు మీతో యుద్ధం చేసినట్లయితే, మీకు వీపు చూపించి పారిపోతారు. తరువాత వారికెలాంటి సహాయం లభించదు.
వారు ఎక్కడున్నా, అవమానానికే గురి చేయబడతారు, అల్లాహ్ శరణులోనో లేక మానవుల అభయంలోనో ఉంటేనే తప్ప; వారు అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యారు మరియు వారు అధోగతికి చేరారు. ఇది వారు అల్లాహ్ సూచనలను తిరస్కరించినందుకు మరియు అన్యాయంగా ప్రవక్తలను చంపి నందుకు. ఇది వారి ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం.
వారందరూ ఒకే రకమైన వారు కారు.
గ్రంథ ప్రజలలో కొందరు సరైన మార్గంలో ఉన్న వారున్నారు; వారు రాత్రివేళలందు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) పఠిస్తూ ఉంటారు మరియు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు.
వారు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు మరియు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మాన్ని నిషేధిస్తారు (నిరోధిస్తారు) మరియు మంచి పనులు చేయటంలో పోటీ పడతారు మరియు ఇలాంటి వారే సత్పురుషులలోని వారు.
మరియు వారు ఏ మంచిపని చేసినా అది వృథా చేయబడదు. మరియు దైవభీతి గలవారెవరో అల్లాహ్ కు బాగా తెలుసు.
నిశ్చయంగా, సత్యతిరస్కారానికి పాల్పబడిన వారికి, వారి సంపద గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ ముందు ఏమీ పనికి రావు. మరియు అలాంటివారు నరకాగ్ని వాసులే. అందు వారు శాశ్వతంగా ఉంటారు.
వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని, తమకు తాము అన్యాయం చేసుకున్నవారి పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే, మంచు గాలితో పోల్చవచ్చు. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కానీ వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది. కాని వారి హృదయాలలో దాచుకున్నది దాని కంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థం చేసుకోగలిగితే (ఎంత బాగుండేది)!
అవును! మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్యగ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. వారు మీతో కలసినపుడు: "మేము విశ్వసించాము." అని అంటారు. కాని వేరుగా ఉన్నప్పుడు, మీ ఎడల ఉన్న క్రోదావేశం వల్ల తమ వ్రేళ్ళను కొరుక్కుంటారు. వారితో: "మీ క్రోధావేశంలో మీరే మాడి చావండి. నిశ్చయంగా, హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు." అని అను.
మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దానినంతా పరివేష్టించి ఉన్నాడు.
మరియు (ఓ ప్రవక్తా! ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో) నీవు వేకుజామున నీ ఇంటి నుండి బయలుదేరి (ఉహుద్ క్షేత్రంలో) విశ్వాసులను వారి వారి యుద్ధ స్థానాలలో నియమించటానికి వెళ్ళావు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
అప్పుడు మీలోని రెండు వర్గాల వారు పిరికితనం చూపబోయారు; మరియు అల్లాహ్ వారికి సంక్షకుడుగా ఉన్నాడు మరియు విశ్వసించిన వారు అల్లాహ్ యందే నమ్మకం ఉంచుకోవాలి.
బద్ర్ (యుద్ధం) నందు మీరు బలహీనులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీకు సహాయం (మిమ్మల్ని విజేతలుగా) చేశాడు. కాబట్టి మీరు కృతజ్ఞతాపరులై అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి!
(ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులతో : "ఏమీ? మీ ప్రభువు, ఆకాశం నుండి మూడు వేల దేవదూతలను దింపి మీకు సహాయం చేస్తున్నది చాలదా?" అని అడిగిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!)
అవును! ఒకవేళ మీరు సహనం వహించి దైవభీతి కలిగి వుంటే, శత్రువు వచ్చి ఆకస్మాత్తుగా మీపై పడినా, మీ ప్రభువు ఐదువేల ప్రత్యేక చిహ్నాలు గల దేవదూతలను పంపి మీకు సహాయం చేయవచ్చు!
అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు శుభవార్త ఇవ్వటానికి మరియు మీ హృదయాలకు తృప్తి కలుగ జేయటానికి మాత్రమే. మరియు సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తప్ప, ఇతరుల నుండి సహాయం (విజయం) రాజాలదు కదా!
ఆయన ఇదంతా సత్యతిరస్కారంపై నడిచేవారిని కొందరిని నశింపజేయటానికి, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుదిరిగి పోవటానికి (చేశాడు).
(ఓ ప్రవక్తా!) ఈ విషయమునందు నీ కెలాంటి అధికారం లేదు. ఆయన (అల్లాహ్) వారిని క్షమించవచ్చు, లేదా వారిని శిక్షించవచ్చు. ఎందుకంటే నిశ్చయంగా, వారు దుర్మార్గులు.
మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.
మరియు సత్యతిరస్కారుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి.
మరియు మీరు కరుణింపబడటానికి అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి.
మరియు మీ ప్రభువు క్షమాభిక్ష కొరకు మరియు స్వర్గవాసం కొరకు ఒకరితో నొకరు పోటీ పడండి; అది భూమ్యాకాశాలంత విశాలమైనది; అది దైవభీతి గలవారికై సిద్ధ పరచపడింది.
(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించుకుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.
మరియు వారు, ఎవరైతే, అశ్లీల పనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించ గలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను), బుద్ధిపూర్వకంగా మూర్ఖపు పట్టుతో మళ్ళీ చేయరు!
ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసేవారికి ఎంత శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది!
మీకు పూర్వం ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు (తరాలు) గడిచి పోయాయి. సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో మీరు భూమిలో సంచారం చేసి చూడండి.
ఇది (ఈ ఖుర్ఆన్) ప్రజల కొరకు ఒక స్పష్టమైన వ్యాఖ్యానం మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం.
కాబట్టి మీరు బలహీనత కనబరచకండి మరియు దుఃఖపడకండి మరియు మీరు విశ్వాసులే అయితే, మీరే తప్పక ప్రాబల్యం పొందుతారు.
ఒకవేళ ఇప్పుడు మీరు గాయపడితే, వాస్తవానికి ఆ జాతివారు (మీ విరోధులు) కూడా ఇదే విధంగా గాయపడ్డారు. మరియు మేము ఇలాంటి దినాలను ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. మరియు అల్లాహ్, మీలో నిజమైన విశ్వాసులెవ్వరో చూడటానికి మరియు (సత్యస్థాపనకు) తమ ప్రాణాలను త్యాగం చేయగల వారిని ఎన్నుకోవటానికి ఇలా చేస్తూ ఉంటాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు.
మరియు అల్లాహ్ విశ్వాసులను పరిశుద్ధులుగా చేయటానికీ మరియు సత్యతిరస్కారులను అణచివేయటానికీ (ఈ విధంగా చేస్తాడు)
ఏమీ? మీలో ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి పోరాడేవారు (ధర్మయోధులు) ఎవరో, అల్లాహ్ చూడక ముందే మరియు సహనం చూపేవారు ఎవరో చూడకముందే, మీరు స్వర్గంలో ప్రవేశించ గలరని భావిస్తున్నారా?
మరియు వాస్తవానికి మీరు (అల్లాహ్ మార్గంలో మరణించాలని కోరుచుంటిరి! అది, మీరు దానిని ప్రత్యక్షంగా చూడక ముందటి విషయం; కాని, మీరు దానిని ఎదురు చూస్తుండగానే, వాస్తవానికి ఇప్పుడు అది మీ ముందుకు వచ్చేసింది.
మరియు ముహమ్మద్ కేవలం ఒక సందేశహరుడు మాత్రమే! వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడిచి పోయారు. ఏమీ? ఒకవేళ అతను మరణిస్తే, లేక హత్యచేయబడితే, మీరు వెనుకంజ వేసి మరలిపోతారా? మరియు వెనుకంజ వేసి మరలిపోయేవాడు అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేడు. మరియు కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
అల్లాహ్ అనుమతి లేనిదే, ఏ ప్రాణి కూడా మరణించజాలదు, దానికి ఒక నియమిత కాలం వ్రాయబడి ఉంది. మరియు ఎవడైతే ఈ ప్రపంచ సుఖాన్ని కోరుకుంటాడో, మేము అతనికది నొసంగుతాము మరియు ఎవడు పరలోక సుఖాన్ని కోరుకుంటాడో అతనికది నొసంగుతాము. మరియు మేము కృతజ్ఞులైన వారికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించగలము.
మరియు ఎందరో ప్రవక్తలు మరియు వారితో కలిసి ఎంతోమంది ధర్మవేత్తలు / దైవభక్తులు (రిబ్బీయ్యూన్) ధర్మ యుద్ధాలు చేశారు, అల్లాహ్ మార్గంలో ఎదురైన కష్టాలకు వారు ధైర్యం విడువలేదు మరియు బలహీనత కనబరచలేదు మరియు వారికి (శత్రువులకు) లోబడనూ లేదు. మరియు అల్లాహ్ ఆపదలలో సహనం వహించే వారిని ప్రేమిస్తాడు.
మరియు వారి ప్రార్థన కేవలం: "ఓ మా ప్రభూ! మా పాపాలను, మా వ్యవహారాలలో మేము మితిమీరి పోయిన వాటిని క్షమించు మరియు మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు మరియు సత్యతిరస్కారులకు ప్రతికూలంగా మాకు విజయాన్ని ప్రసాదించు." అని పలకటం మాత్రమే!
కావున అల్లాహ్ వారికి ఇహలోకంలో తగిన ఫలితాన్ని మరియు పరలోకంలో ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. మరియు అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.
ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల సలహాలను పాటిస్తే, వారు మిమ్మల్ని వెనుకకు (అవిశ్వాసం వైపునకు) మరలిస్తారు. అప్పుడు మీరే నష్టపడిన వారవుతారు.
వాస్తవానికి! అల్లాహ్ యే మీ సంరక్షకుడు. మరియు ఆయనే అత్యుత్తమ సహాయకుడు.
ఆయన ఏ విధమైన ప్రమాణం అవతరింపజేయనిదే, అల్లాహ్ కు సాటి కల్పించినందుకు, మేము సత్యతిరస్కారుల హృదయాలలో ఘోర భయాన్ని కల్పిస్తాము. వారి ఆశ్రయం నరకాగ్నియే! అది దుర్మార్గులకు లభించే, అతి చెడ్డ నివాసం.
మరియు వాస్తవానికి అల్లాహ్ మీకు చేసిన తన వాగ్దానాన్ని సత్యపరచాడు.
ఎప్పుడైతే మీరు ఆయన అనుమతితో, వారిని (సత్యతిరస్కారులను) చంపుతూ ఉన్నారో! తరువాత మీరు పిరికితనాన్ని ప్రదర్శించి, మీ కర్తవ్య విషయంలో పరస్పర విభేదాలకు గురి అయ్యి - ఆయన (అల్లాహ్) మీకు, మీరు వ్యామోహపడుతున్న దానిని చూపగానే - (మీ నాయకుని) ఆజ్ఞను ఉల్లంఘించారు. (ఎందుకంటే) మీలో కొందరు ఇహలోకాన్ని కోరేవారున్నారు మరియు మీలో కొందరు పరలోకాన్ని కోరేవారున్నారు. తరువాత మిమ్మల్ని పరీక్షించటానికి ఆయన (అల్లాహ్) మీరు మీ విరోధులను ఓడించకుండా చేశాడు. మరియు వాస్తవానికి ఇపుడు ఆయన మిమ్మలన్ని క్షమించాడు. మరియు అల్లాహ్ విశ్వాసుల పట్ల ఎంతో అనుగ్రహుడు.
(జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడయితే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో! అప్పుడు (మీ ఈ వైఖరికి) ప్రతిఫలంగా (అల్లాహ్) మీకు దుఃఖం మీద దుఃఖం కలుగజేసాడు; మీరు ఏదైనా పోగొట్టుకున్నా, లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేందుకు. మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్ బాగా ఎరుగును.
అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన (అల్లాహ్) మీపై శాంతి భద్రతలను అవతరింపజేశాడు; దాని వల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది.
కాని మరికొందరు - కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యత నిచ్చేవారు, అల్లాహ్ ను గురించి పామరుల వంటి తప్పుడు ఊహలు చేసేవారు - ఇలా అన్నారు: "ఏమీ? ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా?" వారితో ఇలా అను: "నిశ్చయంగా, సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహ్ దే!" వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అంటారు: "మాకు అధికారమే ఉండి వుంటే, మేము ఇక్కడు చంపబడి ఉండేవారము కాదు." వారికి ఇలా జవాబివ్వు: "ఒకవేళ మీరు మీ ఇళ్ళలోనే ఉండి వున్నప్పటికీ, మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలి వచ్చేవారు." మరియు అల్లాహ్ మీ గుండెలలో దాగి వున్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుద్ధ పరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో (దాగి) ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
రెండు సైన్యాలు (ఉహుద్ యుద్ధానికి) తలబడిన దినమున, వాస్తవానికి మీలో వెన్ను చూపిన వారిని - వారు చేసుకున్న వాటికి (కర్మలకు) ఫలితంగా - షైతాను వారి పాదాలను జార్చాడు. అయినా, వాస్తవానికి అల్లాహ్ వారిని క్షమించాడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు.
ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల మాదిరిగా ప్రవర్తించకండి; వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే, లేదా యుద్ధంలో ఉంటే, (అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే) వారిని గురించి ఇలా అనేవారు: "ఒకవేళ వారు మాతోపాటు ఉండివుంటే చనిపోయే వారు కాదు మరియు చంపబడేవారునూ కాదు!" వాటిని (ఈ విధమైన మాటలను) అల్లాహ్ వారి హృదయ ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. మరియు అల్లాహ్ యే జీవనమిచ్చే వాడు. మరియు మరణమిచ్చే వాడు మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తున్నాడు.
మరియు మీరు అల్లాహ్ మార్గంలో చంపబడినా లేదా మరణించినా మీకు లభించే అల్లాహ్ క్షమాభిక్ష మరియు కారుణ్యం, నిశ్చయంగా మీరు కూడబెట్టే వాటి అన్నిటి కంటే ఎంతో ఉత్తమమైనవి.
మరియు మీరు మరణించినా లేదా చంపబడినా, మీరందరూ అల్లాహ్ సమక్షంలో సమావేశపరచ బడతారు.
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారి పట్ల మృదుహృదయుడవయ్యావు. నీవే గనక క్రూరుడవు, కఠిన హృదయుడవు అయి వుంటే, వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పారిపోయే వారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. ఆ పిదప నీవు కార్యానికి సిద్ధమైనపుడు అల్లాహ్ పై ఆధారపడు. నిశ్చయంగా, అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు.
ఒకవేళ మీకు అల్లాహ్ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకుంటారు!
మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం (బూటీ) కొరకు నమ్మక ద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మకద్రోహానికి పాల్పడినవాడు పునరుత్థాన దినమున తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.
ఏమీ? అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి, అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం!
అల్లాహ్ దృష్టిలో వారు వేర్వేరు స్థానాలలో ఉన్నారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.
వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ముహమ్మద్) ను లేపాడు; అతను, ఆయన (అల్లాహ్) సందేశాలను (ఆయాత్ లను) వారికి వినిపిస్తున్నాడు.
మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు; మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు; మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి వున్నారు.
ఏమయిందీ? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది! వాస్తవానికి మీరు, వారికి (మీ శత్రువులను బద్ర్ లో) ఇంతకు రెట్టింపు ఆపద కలిగించారు కదా! అయితే ఇప్పుడు: "ఇది ఎక్కడి నుంచి వచ్చిందీ?" అని అంటున్నారా? వారితో ఇలా అను: "ఇది మీరు స్వయంగా తెచ్చుకున్నదే!" నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
మరియు (ఉహుద్ యుద్ధరంగంలో) రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు, మీకు కలిగిన కష్టం, అల్లాహ్ అనుమతితోనే కలిగింది మరియు అది నిజమైన విశ్వాసులెవరో తెలుసుకోవటానికి -
మరియు కపటవిశ్వాసులు ఎవరో తెలుసుకోవటానికి.
మరియు వారితో (కపట విశ్వాసులతో): "రండి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి, లేదా కనీసం మిమ్మల్ని మీరు రక్షించుకోండి!" అని అన్నప్పుడు వారు: "ఒకవేళ మాకు యుద్ధం జరుగుతుందని తెలిసివుంటే, మేము తప్పకుండా మీతోపాటు వచ్చి ఉండేవారం." అని జవాబిచ్చారు. ఆ రోజు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్నారు. మరియు వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోళ్ళతో పలుకుతూ ఉన్నారు. మరియు వారు దాస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు.
అలాంటి వారు తమ ఇండ్లలో కూర్చొని ఉండి (చంపబడిన) తమ సోదరులను గురించి ఇలా అన్నారు: "వారు గనక మా మాట విని ఉంటే చంపబడి ఉండేవారు కాదు!" నీవు వారితో: "మీరు సత్యవంతులే అయితే, మీకు మరణం రాకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోండి!" అని చెప్పు.
మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులై, తమ ప్రభువు వద్ద జీవనోపాధి పొందుతున్నారు.
అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానితో (ప్రాణత్యాగంతో) వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు. మరియు వారిని కలువక, వెనుక (బ్రతికి) ఉన్నవారి కొరకు (ఇవ్వబడిన శుభవార్తతో) వారు సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
వారు అల్లాహ్ అనుగ్రహానికి, దాతృత్వానికి సంతోషపడుతూ ఉంటారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల ప్రతిఫలాన్ని వ్యర్థం కానివ్వడు.
ఎవరైతే గాయపడిన తరువాత కూడా అల్లాహ్ మరియు సందేశహరుని (ఆజ్ఞలను) పాటించారో; వారిలో ఎవరైతే, సత్కార్యాలు చేశారో, మరియు దైవభీతి కలిగి ఉన్నారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంది.
వారితో (విశ్వాసులతో) ప్రజలు: "వాస్తవానికి, మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి." అని అన్నప్పుడు, వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు: "మాకు అల్లాహ్ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు." అని అన్నారు.
ఈ విధంగా వారు అల్లాహ్ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో (యుద్ధరంగం నుండి) తిరిగి వచ్చారు, వారికెలాంటి హాని కలుగలేదు మరియు వారు అల్లాహ్ అభీష్టాన్నీ అనుసరించారు. మరియు అల్లాహ్ ఎంతో అనుగ్రహుడు, సర్వోత్తముడు.
నిశ్చయంగా, షైతానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు. కావున మీరు వారికి భయపడకండి. మరియు మీరు విశ్వాసులే అయితే, కేవలం నాకే (అల్లాహ్ కే) భయపడండి.
మరియు సత్యతిరస్కారం కొరకు పోటీ చేసేవారు నిన్ను ఖేదానికి గురి చేయనివ్వరాదు. నిశ్చయంగా, వారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. పరలోక సుఖంలో అల్లాహ్ వారి కెలాంటి భాగం ఇవ్వదలచుకోలేదు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.
నిశ్చయంగా, విశ్వాసానికి బదులుగా సత్యతిరస్కారాన్ని కొనేవారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్యతిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి, మేము ఇస్తున్న ఈ వ్యవధి వారి పాపాలు అధికమవటానికే! మరియు వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.
అల్లాహ్ విశ్వాసులను, మీరు (సత్యతిరస్కారులు) ఇప్పుడు ఉన్న స్థితిలో, ఏ మాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్ విధానం కాదు, కాని అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి మరియు ఒకవేళ మీరు విశ్వసించి, దైవభీతి గలిగి ఉంటే, మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకది (లోభమే) మేలైనదని భావించ రాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడల చుట్టు కట్టబడుతుంది. మరియు భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును.
"నిశ్చయంగా, అల్లాహ్ పేదవాడు మరియు మేము ధనవంతులము." అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్ విన్నాడు. వారు పలుకుతున్నది మరియు అన్యాయంగా ప్రవక్తలను వధించినది మేము వ్రాసిపెడుతున్నాము. మరియు (పునరుత్థాన దినమున) వారితో మేమను ఇలా అంటాము: "దహించే అగ్ని శిక్షను రుచి చూడండి!"
ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాడు!
"అగ్ని (ఆకాశం నుండి దిగి వచ్చి) బలి (ఖుర్బానీ)ని మా సమక్షంలో తిననంత వరకు మేము ఎవరినీ ప్రవక్తగా స్వీకరించ గూడదని అల్లాహ్ మాతో వాగ్దానం తీసుకున్నాడు.
" అని పలికే వారితో (యూదులతో) ఇలా అను: "వాస్తవానికి నాకు పూర్వం మీ వద్దకు చాలా మంది ప్రవక్తలు స్పష్టమైన ఎన్నో నిదర్శనాలను తీసుకువచ్చారు; మరియు మీరు ప్రస్తావించే ఈ నిదర్శనాన్ని కూడా! మీరు సత్యవంతులే అయితే, మీరు వారిని ఎందుకు హత్య చేశారు?"
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే, నీవు (ఆశ్చర్యపడకు); వాస్తవానికి నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, సహీఫాలను (జుబుర్ లను) మరియు జ్యోతిని ప్రసాదించే గ్రంథాన్ని తీసుకు వచ్చిన చాలా మంది ప్రవక్తలు కూడా అసత్యవాదులని తిరస్కరించబడ్డారు.
ప్రతి పాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే!
నిశ్చయంగా మీరు, మీ ధన ప్రాణాలతో పరీక్షింపబడతారు; మరియు నిశ్చయంగా, మీకు పూర్వం గ్రంథం ప్రసాదించబడిన వారి నుండి మరియు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పించిన వారి నుండి, మీరు అనేక వేదన కలిగించే మాటలు వింటుంటారు. కానీ, ఒకవేళ మీరు ఓర్పు వహించి, దైవభీతి కలిగి ఉంటే! నిశ్చయంగా అది ఎంతో సాహసంతో కూడిన కార్యం.
మరియు అల్లాహ్ గ్రంథ ప్రజలతో: "దీనిని (దైవప్రవక్త ముహమ్మద్ రానున్నాడు అనే సత్యాన్ని) ప్రజలకు తెలియజేయండి మరియు దానిని దాచకండి." అని చేయించిన ప్రమాణాన్ని , (జ్ఞాపకం చేసుకోండి). కాని వారు దానిని తమ వీపుల వెనుక పడవేసి దానికి బదులుగా స్వల్ప మూల్యాన్ని పొందారు, వారి ఈ వ్యాపారం ఎంత నీచమైనది!
ఎవరైతే తాము చేసిన పనికి సంతోష పడుతూ, తాము చేయని పనికి ప్రశంసలు లభిస్తాయని కోరుతారో, వారు శిక్ష నుండి తప్పించుకోగలరని నీవు భావించకు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళ అనుక్రమం (ఒకదాని తరువాత ఒకటి రావడం మరియు వాటి హెచ్చుతగ్గుల)లో, బుద్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి;
ఎవరైతే నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అన్ని వేళలా అల్లాహ్ ను స్మరిస్తారో, భూమ్యాకాశాల నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారో! (వారు ఇలా ప్రార్థిస్తారు): "ఓ మా ప్రభూ! నీవు దీనిని (ఈ విశ్వాన్ని) వ్యర్థంగా సృష్టించలేదు, నీవు సర్వలోపాలకు అతీతువు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.
"ఓ మా ప్రభూ! నీవు ఎవడిని నరకాగ్నిలో పడవేస్తావో వాస్తవంగా వానిని నీవు అవమానపరిచావు. మరియు దుర్మార్గులకు సహాయకులు ఎవ్వరూ ఉండరు."
"ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము: 'మీ ప్రభువును విశ్వసించండి.' అని విశ్వాసం వైపుకు పిలిచే అతని (ముహమ్మద్) యొక్క పిలుపు విని విశ్వసించాము. ఓ మా ప్రభూ! మా పాపాలను క్షమించు మరియు మాలో ఉన్న చెడులను మా నుండి తొలగించు మరియు పుణ్యాత్ములతో (ధర్మనిష్ఠాపరులతో) మిమ్మల్ని మరణింపజెయ్యి!"
"ఓ మా ప్రభూ! మరియు నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానాలను పూర్తి చేయి మరియు తీర్పు దినమున మమ్మల్ని అవమాన పరచకు. నిశ్చయంగా, నీవు నీ వాగ్దానాలను భంగం చేయవు."
అప్పుడు సమాధానంగా వారి ప్రభువు, వారితో ఇలా అంటాడు: "మీలో పురుషులు గానీ, స్త్రీలు గానీ చేసిన కర్మలను నేను వ్యర్థం కానివ్వను. మీరందరూ ఒకరికొకరు (సమానులు).
కనుక నా కొరకు, తమ దేశాన్ని విడిచి పెట్టి వలస పోయినవారు, తమ గృహాల నుండి తరిమి వేయబడి (నిరాశ్రయులై, దేశదిమ్మరులై), నా మార్గంలో పలుకష్టాలు పడినవారు మరియు నా కొరకు పోరాడినవారు మరియు చంపబడినవారు; నిశ్చయంగా, ఇలాంటి వారందరి చెడులను వారి నుండి తుడిచి వేస్తాను. మరియు నిశ్చయంగా, వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రేవశింపజేస్తాను; ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం. మరియు అల్లాహ్! ఆయన వద్దనే ఉత్తమ ప్రతిఫలం ఉంది."
(ఓ ప్రవక్తా!) దేశాలలో సత్యతిరస్కారుల సంచారం, నిన్ను మోసంలో పడవేయకూడదు!
ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి అధ్వాన్నమైన నివాస స్థలము.
కాని ఎవరైతే తమ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉంటారో, వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అందులో వారు అల్లాహ్ ఆతిథ్యం పొందుతూ శాశ్వతంగా ఉంటారు. మరియు పుణ్యాత్ములకు (ధర్మనిష్ఠాపరులకు) అల్లాహ్ దగ్గర ఉన్నదే ఎంతో శ్రేష్ఠమైనది!
మరియు నిశ్చయంగా, గ్రంథ ప్రజలలో, కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు.
మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్ కు వినమ్రులై, అల్లాహ్ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.
ఓ విశ్వాసులారా! సహనం వహించండి, మరియు (మిథ్యావాదుల ముందు స్థైర్యాన్ని చూపండి. మరియు (మాటువేసి ఉండవలసిన చోట) స్థిరంగా ఉండండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!