القهار
كلمة (القهّار) في اللغة صيغة مبالغة من القهر، ومعناه الإجبار،...
అలిఫ్ - లామ్ - మీమ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు. మరియు ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన సత్యం! అయినా చాలా మంది, విశ్వసించటం లేదు.
మీరు చూస్తున్నారు కదా! ఆకాశాలను స్థంభాలు లేకుండా నిలిపిన ఆయన, అల్లాహ్ యే! ఆ తరువాత ఆయన, తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. మరియు ఆయన సూర్యచంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటీ తన నిర్ణీత కాలంలో (తన పరిధిలో) పయనిస్తూ ఉంటుంది. ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ, తన సూచనలను వివరిస్తున్నాడు; బహుశా! (ఈ విధంగా నైనా) మీరు మీ ప్రభువున కలుసుకో వలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని.
మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని, రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు. ఆయనే రాత్రిని పగటి మీద కప్పుతాడు. నిశ్చయంగా వీటన్నింటిలో ఆలోచించేవారి కొరకు సూచనలున్నాయి.
మరియు భూమిలో వేర్వేరు రకాల (నేలలు) ఒకదాని కొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి మరియు ద్రాక్షతోటలు, పంటపొలాలు మరియు ఖర్జూరపు చెట్లు, కొన్ని ఒక్కొక్కటి గానూ, మరికొన్ని గుచ్చలు - గుచ్చలు (జతలు) గానూ ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది. కాని తినటానికి వాటి రుచులు, ఒకటి మరొకదాని కంటే ఉత్తమమైనదిగా ఉన్నట్లు చేశాము. నిశ్చయంగా వీటన్నింటిలో అర్థం చేసుకో గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి.
ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉంటే, వారి ఈ మాట అంతకంటే ఆశ్చర్యకరమైనది: "ఏమీ? మేము మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవంగా మరల క్రొత్తగా సృష్టించబడతామా?" అలాంటి వారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. అలాంటి వారి మెడలలో సంకెళ్ళు వేయబడి ఉంటాయి. మరియు అలాంటి వారే నరకవాసులు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.
మరియు వారు మేలుకు ముందు కీడును (తెమ్మని) నిన్ను తొందరపెడుతున్నారు. మరియు వారికి పూర్వం అనేక ఉదాహరణలు గడిచాయి. మరియు వారు దుర్మార్గం చేసినప్పటికీ! నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజల యెడల క్షమాశీలుడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు శిక్షించటంలో కూడా చాలా కఠినుడు.
మరియు సత్యతిరస్కారులు అంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" వాస్తవానికి నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే! మరియు ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చి ఉన్నాడు.
అల్లాహ్ కు, ప్రతి స్త్రీ తన గర్భంలో దాల్చేది మరియు గర్భకాలపు హెచ్చు-తగ్గులు కూడా బాగా తెలుసు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం (నిర్ణయింపబడి) ఉంది.
ఆయన అగోచర మరియు గోచర విషయాన్నింటినీ ఎరిగిన వాడు. మహనీయుడు, సర్వోన్నతుడు.
మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, (అల్లాహ్ దృష్టిలో) అంతా సమానమే (ఒకటే)!
ప్రతివాని ముందూ వెనుకా ఆయన నియమించిన, ఒకరి వెంట ఒకరు వచ్చే కావలివారు (దైవదూతలు) ఉన్నారు. వారు అల్లాహ్ ఆజ్ఞానుసారం అతనిని (మనిషిని) కాపాడుతూ ఉంటారు. నిశ్చయంగా, ఒక జాతి వారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారి స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతి వారికి కీడు చేయదలిస్తే దానిని ఎవ్వరూ తొలగించలేరు. మరియు వారికి ఆయన తప్ప మరొక స్నేహితుడు (ఆదుకునేవాడు) లేడు.
ఆయనే! మీకు భయం మరియు ఆశ కలిగించే మెరుపులను చూపుతున్నాడు. మరియు ఆయనే నీళ్ళతో బరువెక్కిన మేఘాలను పుట్టిస్తున్నాడు.
మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది.
ఆయన స్తోత్రం చేస్తుంది; మరియు దైవదూతలు కూడా ఆయన భయంతో (ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు)! మరియు ఆయన ఫెళఫెళమనే ఉరుములను పంపి, వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు (సత్యతిరస్కారులు) అల్లాహ్ ను గురించి వాదులాడుతున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు.
ఆయనను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి (ఇతర శక్తులు) వారికి ఏ విధమైన సమాధాన మివ్వలేవు.
అది (వాటిని వేడుకోవడం): ఒకడు తన రెండు చేతులు నీటి వైపుకు చాచి, అది (నీరు) నోటి దాకా రావాలని ఆశించటమే! కాని అది అతని (నోటి వరకు) చేరదు కదా! (అలాగే) సత్యతిరస్కారుల ప్రార్థనలన్నీ వ్యర్థమై పోతాయి.
మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానో అయిష్టంగానో అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం (సాష్టాంగం చేస్తూ ఉంటాయి).
ఇలా అడుగు: "భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: "అల్లాహ్!" తరువాత ఇలా అను: "అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: "ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: "అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త. మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)"
ఆయన (అల్లాహ్) ఆకాసం నుండి నీరు కురిపించగా (ఎండిపోయిన) సెలయేళ్ళు తమ తమ పరిమాణాలకు సరిపడేలా ప్రవహింప సాగుతాయి. అప్పుడు వరద (ఉపరితలం మీద) నురుగులు ఉబ్బి వస్తాయి. మరియు అగ్నిని రగిలించి నగలు, పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదే విధంగా నురుగులు వస్తాయి. ఈ విధంగా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరి పోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణలను వివరిస్తున్నాడు.
తమ ప్రభువు సందేశాన్ని స్వీకరించిన వారికి మంచి ప్రతిఫలం ఉంటుంది.
మరియు ఆయన సందేశాన్ని స్వీకరించని వారి దగ్గర భూమిలో ఉన్నదంతా, మరియు దానితో పాటు దానికి సమానంగా ఉన్నా, వారు అదంతా పరిహారంగా ఇవ్వదలచుకున్నా (అది స్వీకరించబడదు). అలాంటి వారి లెక్క దారుణంగా ఉంటుంది. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది ఎంతో దుర్భరమైన విరామ స్థలము.
ఏమీ? నీ ప్రభువు నుండి నీపై అవతరింప జేయబడినది (ఈ సందేశం) సత్యమని తెలుసుకున్నవాడు, గ్రుడ్డివానితో సమానుడా? నిశ్చయంగా, బుద్ధిమంతులే ఇది (ఈ విషయం) గ్రహించగలరు.
వారే, ఎవరైతే అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేస్తారో మరియు తమ వాగ్దానాన్ని భంగపరచరో!
మరియు ఎవరైతే అల్లాహ్ కలుపమని ఆజ్ఞాపించిన వాటిని కలుపుతారో! మరియు తమ ప్రభువుకు భయపడతారో మరియు దారుణంగా (ఖచ్చితంగా) తీసుకోబడే లెక్కకు భయపడుతారో!
మరియు ఎవరైతే తమ ప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి మరియు నమాజ్ స్థాపించి మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తూ, చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారో; అలాంటి వారికే ఉత్తమ పరలోక గృహం ప్రతిఫలంగా ఉంటుంది.
శాశ్వతంగా ఉండే ఉద్యావనాలలో వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి తాతలు, వారి సహవాసులు (అజ్వాజ్) మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు. మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు.
(దేవదూతలు అంటారు): "మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగు గాక(సలాం)! ఇక ఈ అంతిమ (పరలోక) గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది!"
మరియు అల్లాహ్ తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగం చేసేవారు మరియు అల్లాహ్ కలపండి అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తిచేవారు! ఇలాంటి వారందరికీ ఆయన శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు వారికి (పరలోకంలో) బహుచెడ్డ నివాసముంటుంది.
అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధి పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వారికి) పరిమితం చేస్తాడు. మరియు వారు ఇహలోక జీవితంలో సంతోషంగా ఉన్నారు, కాని పరలోక జీవితం ముందు ఇహలోక జీవిత సుఖసంతోషాలు తాత్కాలికమైనవే (తుచ్ఛమైనవే)!
మరియు సత్యతిరస్కారులు: "అతని (ముహమ్మద్) పై, అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" అని అంటున్నారు. వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా వదలుతాడు మరియు పశ్చాత్తాప పడి ఆయన వైపునకు తిరిగే వారికి సన్మార్గం చూపుతాడు."
ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది.
విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి (ఇహలోకంలో) ఆనందం, సర్వసుఖాలు మరియు (పరలోకంలో) మంచి గమ్యస్థానం ఉంటాయి.
అందుకే (ఓ ముహమ్మద్!) మేము నిన్ను ఒక సమాజం వారి వద్దకు పంపాము - వాస్తవానికి వారికి పూర్వం ఎన్నో సమాజాలు గతించాయి - నీవు నీపై మేము అవతరింప జేసిన దివ్యజ్ఞానం వారికి వినిపించటానికి! ఎందుకంటే వారు తమ కరుణామయుణ్ణి తిరస్కరిస్తున్నారు. వారితో అను: "ఆయనే నా ప్రభూవు! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయన వైపునకే నేను పశ్చాత్తాపంతో మరలి పోవలసి ఉన్నది."
మరియు నిశ్చయంగా, (ఖుర్ఆన్ ను) పఠించటం వలన కొండలు కదలింపబడినా, లేదా దాని వల్ల భూమి చీల్చబడినా, లేదా దాని వల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా! (అవిశ్వాసులు దానిని విశ్వసించరు). వాస్తవానికి సర్వ నిర్ణయాల అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది.
ఏమీ? ఒకవేళ అల్లాహ్ కోరితే సర్వ మానవులకు సన్మార్గం చూపేవాడని తెలిసి కూడా విశ్వాసులు ఎందుకు ఆశ వదులుకుంటున్నారు? మరియు అల్లాహ్ వాగ్దానం పూర్తి అయ్యేవరకు సత్యతిరస్కారంలో మునిగి ఉన్న వారిపై, వారి కర్మల ఫలితంగా, ఏదో ఒక ఆపద కలుగుతూనే ఉంటుంది. లేదా అది వారి ఇండ్ల సమీపంలో పడుతూ ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు.
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించ బడ్డారు, కావున (మొదట) నేను సత్యతిరస్కారులకు వ్యవధి నిచ్చాను తరువాత వారిని పట్టుకున్నాను. (చూశారా!) నా ప్రతీకారం (శిక్ష) ఎలా ఉండిందో!
ఏమీ? ఆయన (అల్లాహ్), ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకొని ఉండేవాడు (మరియు లాభనష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా)? అయినా వారు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పిస్తారు.
వారితో ఇలా అను: "(నిజంగానే వారు అల్లాహ్ స్వయంగా నియమించుకున్న భాగస్వాములే అయితే) వారి పేర్లను తెలుపండి! లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా? వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారికి, వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది. మరియు వారు ఋజుమార్గం నుండి నిరోధించచబడ్డారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు.
వారికి ఇహలోక జీవితంలో శిక్ష వుంది. మరియు వారి పలోక జీవిత శిక్ష ఎంతో కఠినమైనది. మరియు వారిని అల్లాహ్ (శిక్ష) నుండి రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు.
దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే! దాని క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి. దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్యతిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే!
మరియు (ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము (ముందు) గ్రంథాన్ని ఇచ్చామో! వారు నీపై అవతరింప జేయబడిన దాని (ఈ గ్రంథం) వలన సంతోషపడుతున్నారు. మరియు వారిలోని కొన్ని వర్గాల వారు దానిలోని కొన్ని విషయాలను తిరస్కరించేవారు కూడా ఉన్నారు. వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని మరియు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించరాదని ఆజ్ఞాపించబడ్డాను. నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను మరియు గమ్యస్థానం కూడా ఆయన వద్దనే ఉంది!
మరియు ఈ విధంగా మేము అరబ్బీ భాషలో మా శాసనాన్ని అవతరింప జేశాము. ఇక నీవు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ నుండి నిన్ను రక్షించేవాడు గానీ, కాపాడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు.
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము మరియు వారికి భార్యాపిల్లలను ప్రసాదించాము. అల్లాహ్ అనుమతి లేకుండా, ఏ అద్భుత సంకేతాన్ని (స్వయంగా) తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు. ప్రతి వాగ్దానానికి (విషయానికి) వ్రాయబడిన ఒక ఆదేశం (శాసనం) ఉంది.
అల్లాహ్ తాను కోరిన దానిని రద్దు చేస్తాడు మరియు (తాను కోరిన దానిని) స్థిరపరుస్తాడు. మరియు మాతృగ్రంథం (ఉమ్ముల్ కితాబ్) ఆయన దగ్గరే ఉంది.
మరియు (ఓ ప్రవక్తా!) మేము వారికి చేసిన వాగ్దానాలలో కొన్నింటిని నీకు చూపినా, లేదా (వాటిని చూపక ముందు) నిన్ను మరణింపజేసినా, నీ బాధ్యత కేవలం (మా సందేశాన్ని) అందజేయటమే! మరియు లెక్క తీసుకోవటం కేవలం మా పని.
ఏమీ? వాస్తవానికి మేము భూమిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నామనేది వారు చూడటం లేదా? మరియు అల్లాహ్ యే ఆజ్ఞ ఇస్తాడు! ఆయన ఆజ్ఞను మార్చే వాడు ఎవ్వడు లేడు. మరియు ఆయన లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.
మరియు వాస్తవానికి వారికి పూర్వం ఉన్నవారు కూడా కుట్రలు పన్నారు. కాని, కుట్రలన్నీ అల్లాహ్ కే చెందినవి. ప్రతి ప్రాణి సంపాందించేది ఆయనకు తెలుసు. మరియు (మేలైన) అంతమ (పరలోక) నివాసం ఎవరిదో సత్యతిరస్కారులు తెలుసుకుంటారు.
మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు నీతో అంటున్నారు: "నీవు సందేశహరుడవు కావు!" వారితో అను: "నాకూ - మీకూ మధ్య అల్లాహ్ సాక్ష్యమే చాలు! మరియు వారి (సాక్ష్యం), ఎవరికైతే గ్రంథజ్ఞానం ఉందో!"