المبين
كلمة (المُبِين) في اللغة اسمُ فاعل من الفعل (أبان)، ومعناه:...
ఓ మానవులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి! నిశ్చయంగా, ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది.
ఆ రోజు ఆవరించినప్పుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ, తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు. కానీ (వాస్తవానికి) వారు త్రాగి (మత్తులో) ఉండరు. కాని అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.
మరియు ప్రజలలో ఒకడుంటాడు, జ్ఞానం లేనిదే, అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ ను అనుసరించేవాడు.
అతడిని (షైతాన్ ను) గురించి వ్రాయబడిందేమిటంటే, వాస్తవానికి ఎవడైతే అతడి వైపునకు మరలుతాడో, వాడిని నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టుడిగా చేస్తాడు మరియు వాడికి మండే నరకాగ్ని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
ఏ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము.
మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది.
ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలవాడు మరియు నిశ్చయంగా ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
మరియు అంతిమ ఘడియ నిశ్చయంగా రానున్నది. అందులో ఎలాంటి సందేహం లేదు మరియు నిశ్చయంగా, అల్లాహ్ గోరీలలో నున్న వారిని మరల బ్రతికించి లేపుతాడు.
అయినా మానవులలో - జ్ఞానం లేనిదే మరియు మార్గదర్శకత్వం లేనిదే మరియు ప్రకాశవంతమైన గ్రంథం లేనిదే - అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు ఉన్నాడు.
(అలాంటి వాడు) గర్వంతో తన మెడను త్రిప్పుకుంటాడు. ఇతరులను అల్లాహ్ మార్గం నుండి తప్పింప జూస్తాడు. వానికి ఈ లోకంలో అవమానముంటుంది. మరియు పునరుత్థాన దినమున అతనికి మేము దహించే అగ్ని శిక్షను రుచి చూపుతాము.
(అతనితో): "ఇది నీవు నీ చేతులారా చేసి పంపిన దాని (ఫలితం) మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు!" (అని అనబడుతుంది).
మరియు ప్రజలలో కొందరు అంచున నిలచి (సందేహంతో) అల్లాహ్ ను ఆరాధించే వారున్నారు. (అలాంటివాడు) తనకు లాభం కలిగితే, ఎంతో తృప్తి పొందుతాడు. కాని ఆపదకు గురి అయితే ముఖం త్రిప్పుకొని, ఇహమును మరియు పరమును కూడా కోల్పోతాడు. స్పష్టమైన నష్టమంటే ఇదే!
అతడు అల్లాహ్ ను వదలి తనకు నష్టం గానీ, లాభం గానీ చేకూర్చలేని వారిని ప్రార్థిస్తున్నాడు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం.
ఎవరి వల్ల లాభం కంటే, నష్టమే ఎక్కువ రానున్నదో వారినే అతడు ప్రార్థిస్తున్నాడు. ఎంత నికృష్టుడైన సంరక్షకుడు మరియు ఎంత నికృష్టుడైన అనుచరుడు (అషీరు).
విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది చేస్తాడు.
ఎవడైతే - ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా - అల్లాహ్, అతనికి (ప్రవక్తకు) సహాయపడడని భావిస్తాడో! (వాడికి సాధ్యమైతే) వాడిని ఒక త్రాడు సహాయంతో ఆకాశంపైకి పోయి, తరువాత వాటిని (అంటే ప్రవక్తపై అవతరింప జేయబడే వహీ మరియు ఇతర సహాయాలను) త్రెంపి చూడమను, అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో!
మరియు ఈ విధంగా మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) స్పష్టమైన సందేశాలతో అవతరింపజేశాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు.
నిశ్చయంగా, (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించిన వారి మరియు యూదులు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు మరియు బహుదైవారాధకులు అయిన వారి మధ్య పునరుత్థాన దినమున అల్లాహ్ తప్పక తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షిగా ఉంటాడు.
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సర్వవృక్షరాశి, సర్వ జీవరాశి మరియు ప్రజలలో చాలా మంది, అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారని? మరియు చాలా మంది శిక్షకు కూడా గురి అవుతారు. మరియు అల్లాహ్ ఎవడినైతే అవమానం పాలు చేస్తాడో, అతడికి గౌరవమిప్పించ గలవాడు ఎవ్వడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు.
ఆ రెండు విపక్ష తెగల వారు తమ ప్రభువును గురించి వాదులాడారు, కావున వారిలో సత్యతిరస్కారులకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి (కుట్టించబడి) ఉంటాయి, వారి తలల మీద సలసలకాగే నీరు పోయబడు తుంది.
దానితో వారి కడుపులలో ఉన్నది మరియు వారి చర్మాలు కరిగి పోతాయి.
ప్రతిసారి వారు దాని (ఆ నరకం) నుండి దాని బాధ నుండి బయట పడటానికి ప్రయత్నించి నప్పుడల్లా తిరిగి అందులోకే నెట్టబడతారు. మరియు వారితో : "నరకాగ్నిని చవి చూడండి!" (అని అనబడుతుంది).
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని అల్లాహ్ క్రింద సెలయేళ్ళు ప్రవహంచే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారికి బంగారం మరియు ముత్యాలతో చేయబడిన కంకణాలు తొడిగింప బడతాయి. అక్కడ వారి కొరకు పట్టు వస్త్రాలు ఉంటాయి.
ఎందుకంటే వారికి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చూపబడింది. మరియు వారు సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) యొక్క మార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందారు.
నిశ్చయంగా, ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తూ (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి, మస్జిద్ అల్ హరామ్ నుండి ఆటంకపరుస్తారో - దేనికైతే మేము అందరి కొరకు సమానంగా చేసి ఉన్నామో - వారు అక్కడ నివసించేవారైనా సరే, లేదా బయట నుండి వచ్చిన వారైనా సరే. మరియు ఎవరైనా దులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము.
మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ) అతనితో: "ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు, మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారి కొరకు నమాజ్ చేసేవారి కొరకు, వంగే (రుకూఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారి కొరకు, పరిశుద్ధంగా ఉంచు" అని అన్నాము.
మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు: "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు.
వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరించి (జిబహ్ చేయటానికి), కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి.
తరువాత వారు హజ్జ్ ఆచారాలు (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి.
ఇదే (హజ్జ్)! మరియు ఎవడైతే అల్లాహ్ విధించిన నిషేధాలను (పవిత్ర నియమానలను) ఆదరిస్తాడో, అది అతని కొరకు, అతని ప్రభువు వద్ద ఎంతో మేలైనది. మరియు మీ కొరకు ఇది వరకు మీకు (నిషిద్ధమని) చెప్ప బడినవి తప్ప, ఇతర పశువులన్నీ ధర్మ సమ్మతం చేయబడ్డాయి. ఇక మీరు విగ్రహారాధన వంటి మాలిన్యం నుండి దూరంగా ఉండండి మరియు అబద్ధపు (బూటకపు) మాటల నుండి కూడా దూరంగా ఉండండి.
ఏకాగ్రచిత్తంతో (ఏకదైవ సిద్ధాంతంతో) అల్లాహ్ వైపునకే మరలండి. ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి.
అల్లాహ్ కు సాటి కల్పించిన వాని గతి ఆకాశం నుండి క్రింద పడిపోయే దాని వంటిదే! దానిని పక్షులైనా ఎత్తుకొని పోవచ్చు, లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగుర గొట్టుకు పోవచ్చు!
ఇదే! మరియు ఎవడైతే, అల్లాహ్ నియమించిన చిహ్నాలను గౌరవిస్తాడో, అది నిశ్చయంగా, హృదయాలలో ఉన్న దైవభీతి వల్లనే!
ఒక నిర్ణీత కాలం వరకు మీకు వాటిలో (ఈ పశువులలో) లాభాలున్నాయి. ఆ తరువాత వాటి గమ్యస్థానం ప్రాచీన గృహమే (కఅబహ్ యే)!
మరియు ప్రతి సమాజానికి మేము ధర్మ ఆచారాలు (ఖుర్బానీ పద్ధతి) నియమించి ఉన్నాము. మేము వారి జీవనోపాధి కొరకు ప్రసాదించిన పశువులను, వారు(వధించేటప్పుడు) అల్లాహ్ పేరును ఉచ్ఛరించాలి. ఎందుకంటే మీరందరి ఆరాధ్య దైవం ఆ ఏకైక దేవుడు (అల్లాహ్)! కావున మీరు ఆయనకు మాత్రమే విధేయులై (ముస్లింలై) ఉండండి. మరియు వినయ విధేయతలు గలవారికి శుభవార్తనివ్వు.
(వారికి) ఎవరి హృదయాలైతే, అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడినప్పుడు భయంతో వణికి పోతాయో మరియు ఆపదలలో సహనం వహిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో మరియు వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చు చేస్తారో!
ఖుర్బానీ పశువులను, మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలుగా చేశాము; మీకు వాటిలో మేలున్నది. కావున వాటిని (ఖుర్బానీ కొరకు) నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అవి (ప్రాణం విడిచి) ప్రక్కల మీద పడిపోయిన తరువాత మీరు వాటిని తినండి. మరియు యాచించని పేదలకు మరియు యాచించే పేదలకు కూడా తినిపించండి. ఈ విధంగా మేము వాటిని మీకు ఉపయుక్తంగా చేశాము, బహుశా మీరు కృతజ్ఞులవు తారేమోనని.
వాటి మాంసం గానీ, వాటి రక్తం గానీ అల్లాహ్ కు చేరవు! కానీ మీ భయభక్తులే ఆయనకు చేరుతాయి. మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ ఘనతను కొనియాడటానికి, ఈ విధంగా ఆయన వాటిని మీకు వశపరిచాడు. సజ్జనులకు శుభవార్తను వినిపించు!
నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించిన వారిని కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ఏ విశ్వాస ఘాతకుణ్ణి మరియు కృతఘ్నుణ్ణి ప్రేమించడు.
తమపై దాడి చేసిన వారితో యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే, వారు అన్యాయానికి గురి చేయ బడ్డారు. నిశ్చయంగా, అల్లాహ్ వారికి సహాయం చేయగల సమర్ధుడు.
వారికి ఎవరైతే కేవలం: "మా ప్రభువు అల్లాహ్!" అని అన్నందుకు మాత్రమే, అన్యాయంగా తమ ఇండ్ల నుండి తరిమి వేయబడ్డారో! ఒకవేళ అల్లాహ్ ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే క్రైస్తవ సన్యాసుల మఠాలు, చర్చులు, యూదుల ప్రార్థనాలయాలు మరియు మస్జిదులు, ఎక్కడైతే అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడుతుందో, అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవి. నిశ్చయంగా తనకు తాను సహాయం చేసుకునే వానికి అల్లాహ్ తప్పకుండా సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు.
వారే! ఒకవేళ మేము వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే, వారు నమాజ్ స్థాపిస్తారు, విధిదానం (జకాత్) ఇస్తారు మరియు ధర్మమును (మంచిని) ఆదేశిస్తారు మరియు అధర్మము (చెడు) నుండి నిషేధిస్తారు. సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లాహ్ చేతిలోనే వుంది.
మరియు (ఓ ముహమ్మద్!) వారు (సత్యతిరస్కారులు) ఒకవేళ నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే (ఆశ్చర్యపడకు); వాస్తవానికి, వారికి పూర్వం నూహ్, ఆద్ మరియు సమూద్ జాతుల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు;
మరియు మద్ యన్ వాసులు కూడాను! అంతేకాదు మూసా కూడా అసత్యవాదుడవని తిరస్కరించబడ్డాడు. కావున నేను సత్యతిరస్కారులకు (మొదట) కొంత వ్యవధినిచ్చి, తరువాత పట్టుకుంటాను. (చూశారా!) నన్ను తిరస్కరించడం వారి కొరకు ఎంత ఘోరమైనదిగా ఉండెనో!
(ఈ విధంగా), మేము ఎన్నో పురాలను నాశనం చేశాము. ఎందుకంటే, వాటి (ప్రజలు) దుర్మార్గులై ఉండిరి. (ఈనాడు) అవి నాశనమై, తమ కప్పుల మీద తలక్రిందులై పడి వున్నాయి. వారి బావులు మరియు వారి దృఢమైన కోటలు కూడా పాడుపడి ఉన్నాయి!
ఏమీ? వారు భూమిలో ప్రయాణం చేయరా? దానిని, వారి హృదయాలు (మనస్సులు) అర్థం చేసుకోగలగటానికి మరియు వారి చెవులు దానిని వినటానికి? వాస్తవమేమిటంటే వారి కన్నులైతే గ్రుడ్డివి కావు, కాని ఎదలలో ఉన్న హృదయాలే గ్రుడ్డివయి పోయాయి.
మరియు (ఓ ముహమ్మద్!) వారు నిన్ను శిక్ష కొరకు తొందర పెడుతున్నారు. కాని అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క దినం మీ లెక్కల ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది.
మరియు దుర్మార్గంలో మునిగివున్న ఎన్నో నగరాలకు నేను వ్యవధినిచ్చాను! తరువాత వాటిని (శిక్షించటానికి) పట్టుకున్నాను. (వారి) గమ్యస్థానం నా వైపునకే కదా!"
(ఓ ముహమ్మద్!) వారితో అను: "ఓ మానవులారా! నేను కేవలం మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"
కావున ఎవరైతే, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి.
కాని ఎవరైతే మా సూచనలను కించపరచటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారు తప్పక భగభగ మండే నరకాగ్నివాసులవుతారు.
మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పంపిన ఏ సందేశహరుడు గానీ, లేదా ప్రవక్త గానీ (నా సందేశాన్ని ప్రజలకు) అందించగోరినపుడు, షైతాన్ అతని కోరికలను ఆటంక పరచకుండా ఉండలేదు. కాని షైతాన్ కల్పించిన ఆటంకాలను అల్లాహ్ నిర్మూలించాడు. ఆ తరువాత అల్లాహ్ తన ఆయత్ లను స్థిరపరచాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
ఎవరి హృదయాలలో రోగముందో! మరియు ఎవరి హృదయాలు కఠినమైనవో, వారికి షైతాన్ కల్పించేవి (సందేహాలు) ఒక పరీక్షగా చేయబడటానికి. మరియు నిశ్చయంగా ఈ దుర్మార్గులు విరోధంలో చాలా దూరం వెళ్ళిపోయారు.
మరియు జ్ఞానమొసంగ బడినవారు ఇది (ఈ ఖుర్ఆన్) నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని తెలుసుకొని దానిని విశ్వసించటానికి, వారి హృదయాలు దానికి అంకితం అవటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించే వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శత్వం చేస్తాడు.
మరియు సత్యతిరస్కారులు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి - అకస్మాత్తుగా అంతిమ ఘడియ వచ్చేవరకు లేదా ఆ ఏకైక దినపు శిక్ష అవతరించే వరకు - సందేహంలో పడి ఉంటారు.
ఆ రోజు సర్వాధిపత్యం అల్లాహ్ దే. ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. కావున విశ్వసించి సత్కార్యాలు చేసేవారు పరమానందకరమైన స్వర్గవనాలలో ఉంటారు.
కాని, ఎవరైతే సత్యతిరస్కారులై, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించారో, వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.
ఎవరు అల్లాహ్ మార్గంలో తమ ఇండ్లను వదలి (వలస) పోయి, ఆ తరువాత చంపబడతారో లేదా మరణిస్తారో వారికి అల్లాహ్ (పరలోకంలో) శ్రేష్ఠమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే ఉత్తమ ఉపాధి ప్రదాత.
ఆయన వారిని వారు తృప్తిపడే స్థలంలో ప్రవేశింపజేస్తాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు.
ఇదే (వారి పరిణామం!) ఇక ఎవడైతే తనకు కలిగిన బాధకు సమానంగా మాత్రమే ప్రతీకారం తీసుకున్న తరువాత అతనిపై మరల దౌర్జన్యం జరిగితే! నిశ్చయంగా అల్లాహ్ అతనికి సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మన్నించేవాడు, క్షమించేవాడు.
ఇలాగే జరుగుతుంది! నిశ్చయంగా, అల్లాహ్ యే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేసే వాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేసేవాడు మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు.
ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం! మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశం నుండి వర్షం కురిపించి, దానితో భూమిని పచ్చగా చేస్తాడని? నిశ్చయంగా, అల్లాహ్ సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.
ఆకాశాలలో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అంతా ఆయనకు చెందినదే. మరియు నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే స్వయం సమృద్ధుడు, ప్రశంసనీయుడు.
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ భూమిలో ఉన్న సమస్తాన్ని మీకు వశపరచాడు. మరియు సముద్రంలో పడవ ఆయన అనుమతితోనే నడుస్తుంది మరియు ఆయనే! తాను అనుమతించే వరకు ఆకాశాన్ని భూమి మీద పడకుండా నిలిపి ఉంచాడు. నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత.
మరియు ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు, తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత ఆయనే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు. నిశ్చయంగా మానవుడు ఎంతో కృతఘ్నుడు!
మేము ప్రతి సమాజం వారికి ఒక ఆరాధనా రీతిని నియమించాము. వారు దానినే అనుసరిస్తారు. కావున వారిని ఈ విషయంలో నీతో వాదులాడనివ్వకు. మరియు వారిని నీ ప్రభువు వైపుకు ఆహ్వానించు. నిశ్చయంగా నీవు సరైన మార్గదర్శకత్వంలో ఉన్నావు.
ఒకవేళ వారు నీతో వాదులాటకు దిగితే, వారితో అను: "మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
అల్లాహ్ పునరుత్థాన దినమున, మీరు పరస్పరం కలిగి ఉన్న అభిప్రాయ భేదాల గురించి తీర్పు చేస్తాడు."
ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.
మరియు వారు అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తున్నారు. దాని కొరకు ఆయన ఎలాంటి నిదర్శనాన్ని అవతరింపజేయలేదు మరియు వారికి (సత్యతిరస్కారులకు) దానిని గురించి ఎలాంటి జ్ఞానం లేదు. మరియు దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు.
మరియు మా స్పష్టమైన సూచనలు వారికి వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాల మీద తిరస్కారాన్ని నీవు గమనిస్తావు. ఇంకా వారు మా సూచనలను వినిపించే వారిపై దాదాపు విరుచుకు పడబోయే వారు. వారితో అను: "ఏమీ? నేను దీని కంటే ఘోరమైన విషయాన్ని గురించి మీకు తెలుపనా? అది నరకాగ్ని! అల్లాహ్ దానిని సత్యతిరస్కారులకు వాగ్దానం చేసి ఉన్నాడు. మరియు అది ఎంత అధ్వాన్నమైన గమ్యస్థానం."
ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు. ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు.
అల్లాహ్ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు.
అల్లాహ్ దేవదూతల నుండి మానవుల నుండి తన సందేశహరులను ఎన్నుకుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు.
ఆయనకు, వారికి ప్రత్యక్షంగా ఉన్నది మరియు వారికి పరోక్షంగా ఉన్నది అంతా తెలుసు. మరియు అన్ని వ్యవహారాలు (పరిష్కారానికి) అల్లాహ్ వైపునకే మరలింప బడతాయి.
ఓ విశ్వాసులారా! (మీ ప్రభువు సన్నిధిలో) వంగండి (రుకూఉ చేయండి), సాష్టాంగం (సజ్దా) చేయండి మరియు మీ ప్రభువునే ఆరాధించండి మరియు మంచి పనులు చేయండి, అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు.
మరియు అల్లాహ్ మార్గంలో పోరాడవలసిన విధంగా ధర్మపోరాటం చేయండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మరియు ఆయన ధర్మం విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇది మీ తండ్రి ఇబ్రాహీమ్ మతమే. ఆయన మొదటి నుండి మీకు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అని పేరు పెట్టాడు. దీనికై మీ సందేశహరుడు మీకు సాక్షిగా ఉండటానికి మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండటానికి. కావున నమాజ్ స్థాపించండి, విధి దానం (జకాత్) ఇవ్వండి. మరియు అల్లాహ్ తో గట్టి సంబంధం కలిగి ఉండండి, ఆయనే మీ సంరక్షకుడు, ఎంత శ్రేష్ఠమైన సంరక్షకుడు మరియు ఎంత ఉత్తమ సహాయకుడు!